హుజురాబాద్ ఎమ్మెల్యేగా యువ నాయకుడు, బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఘన విజయం సాధించి హుజురాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరవేశారు. గత 20 సంవత్సరాలుగా ఈటల రాజేందర్ కు కంచుకోటైన హుజురాబాద్ లో పాడి కౌశిక్ రెడ్డి 17,158 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కౌశిక్ రెడ్డికి మొత్తం 80,003 ఓట్లు రాగా ఈటల రాజేందర్ కు 62,845 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ కు 52,461 ఓట్లు వచ్చాయి. దీంతో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలారు. గత మూడు రోజులుగా ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుపై నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొనగా ఎట్టకేలకు ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుండి పాడి కౌశిక్ రెడ్డి ఆధిపత్యం కొనసాగిస్తూ నియోజకవర్గ ప్రజల అంచనాలకు అందనంత మెజార్టీ సాధించడం విశేషం.
హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలిచినా స్వల్ప మెజార్టీతో మాత్రమే గెలుపొందుతారని అందరూ భావించినప్పటికీ కౌశిక్ రెడ్డి 17,158 మెజార్టీ సాధించడంతో బిఆర్ఎస్ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత రెండు నెలల నుండి ప్రజలతో మమేకమవుతూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం పాడి కౌశిక్ రెడ్డికి కలిసి వచ్చిన అంశంగా చెప్పవచ్చు.
నియోజకవర్గ ప్రజలు తనపై ఎంతో నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మెరుగైన పాలన అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు.