Kavitha visits Harish Rao house: మాజీ మంత్రి, సీనియర్ బీఆర్‌ఎస్ నాయకుడు హరీశ్ రావును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. హరీశ్ రావు తండ్రి సత్యనారాయణరావు రెండు రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, కవిత నేడు హరీశ్ రావు నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సత్యనారాయణరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేసి, కాసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
పరామర్శకు రాజకీయ ప్రాధాన్యత:
ఈ పరామర్శకు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం, సత్యనారాయణరావు అంత్యక్రియలకు కవిత హాజరు కాకపోవడం. ఆమె మిన్న జరిగిన అంత్యక్రియలకు వెళ్ళకపోవడంతో, గతంలో హరీశ్ రావుతో ఆమెకు ఉన్న విభేదాల కారణంగానే రాలేదంటూ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.
విభేదాల చరిత్ర: గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కవిత.. హరీశ్ రావును లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యల తర్వాత వారిద్దరి మధ్య రాజకీయ వైరుధ్యం స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో, అన్ని ఊహాగానాలకు తెరదించుతూ, మరణం జరిగిన మూడు రోజుల తర్వాత కవిత స్వయంగా హరీశ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాళేశ్వరం వివాదం తర్వాత కవిత హరీశ్ ఇంటికి వెళ్లడం ఇదే మొదటిసారి.

బీఆర్‌ఎస్ పార్టీ ఇటీవల ఎన్నికల్లో పరాజయం పాలై, నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో, ఈ పరామర్శ పార్టీ ఐక్యతను ప్రదర్శించడానికి ఒక ప్రయత్నంగా చూడవచ్చు. ప్రధాన నాయకుల మధ్య విభేదాలు లేవని, వారు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని కార్యకర్తలకు తెలియజేయడం దీని లక్ష్యంగా కుడా భావించవచ్చు. అలాగే ఈ పరామర్శ అనేది హరీశ్ రావు మరియు కవిత మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాలను వెంటనే తొలగించక పోయినా, పార్టీలోని కీలక నాయకుల మధ్య శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి చేసిన ఒక ముఖ్యమైన చర్యగా పరిగణించవచ్చు.


