MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై కల్వకుంట్ల కవితతో సీబీఐ విచారణ ఆదివారం సాయంత్రం పూర్తైంది. దాదాపు ఏడున్నర గంటలపాటు విచారణ కొనసాగింది. ఉదయం పదకొండు గంటలకు బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి చేరుకున్న అధికారులు సాయంత్రం ఆరున్నర గంటల వరకు విచారించారు. ఈ స్కామ్‌కు సంబంధించి కవిత నుంచి సీబీఐ అధికారులు పలు వివరాలు సేకరించారు.
సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద సాక్షిగా మాత్రమే కవితను అధికారులు విచారించారు. ఈ విచారణ సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు ఆమె నివాసం దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణ జరిపిన సీబీఐ అధికారుల్లో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. అయితే, విచారణ పూర్తైనప్పటికీ, అవసరమైతే మరోసారి పిలుస్తామని అధికారులు ఆమెకు చెప్పినట్లు సమాచారం. విచారణ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో కవిత నివాసం వద్దకు చేరుకున్నాయి.
విచారణ అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కవిత నివాసానికి చేరుకుని, ఆమెతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తన ఇంటి వద్ద తన కోసం ఎదురు చూస్తున్న పార్టీ శ్రేణులకు కవిత అభివాదం చేశారు. తర్వాత కవిత ఇంటి నుంచి బయల్దేరి సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతి భవన్ వెళ్లారు.
అక్కడ తన తండ్రి, సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. విచారణ తీరును కవిత సీఎం కేసీఆర్‌కు వివరించారు. దాదాపు 45 నిమషాలపాటు వీరిరువురి సమావేశం జరిగింది. కేసీఆర్‌తో సమావేశం అనంతరం కవిత ప్రగతి భవన్ నుంచి తన ఇంటికి బయల్దేరి వెళ్లారు.