మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) విమర్శించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఆమె మట్లాడారు. మూసీ ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు రుణం అడగలేదని మంత్రి శ్రీధర్‌బాబు(Sridhar Babu) సభను తప్పుదోవ పట్టించారన్నారు. సెప్టెంబర్‌లో రుణం అడిగినట్లు సాక్ష్యాధారాలు బయటపెట్టారు. డీపీఆర్ లేదని అసెంబ్లీలో చెబుతున్నారని.. కానీ ప్రపంచ బ్యాంకుకు సెప్టెంబర్ 19న ఇచ్చిన నివేదికలో డీపీఆర్ ఉందని పేర్కొన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేదల నుంచి భూములు లాక్కొని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ చేయాలని అనుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
ఇంత పచ్చి అబద్ధాలు ఎందుకు? ఎవరి లాభంకోసం ఇదంతా చేస్తున్నారు? ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. హైడ్రా, మూసీ బాధితుల EMIలు ఎవరు కడతారు ? అంటూ నిలదీశారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ప్రపంచ బ్యాంకును తెలంగాణలో అడుగుపెట్టనివ్వలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వచ్చిన ఏడాదిలోనే రెడ్‌కార్పెట్ వేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రూ.14వేల కోట్ల సాయం అడిగారని.. మూసీ ప్రాజెక్టుపై అబద్ధాలు చెబుతున్న ఈ ప్రభుత్వాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదని కవిత హెచ్చరించారు.