Sunday, November 16, 2025
HomeతెలంగాణKavitha Blasts: కవిత బ్లాస్ట్.. కాంగ్రెస్‌కు బూస్ట్

Kavitha Blasts: కవిత బ్లాస్ట్.. కాంగ్రెస్‌కు బూస్ట్

Kavitha strokes:రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారాయి. తమ పార్టీలో కీలక నేతలపైనే అవినీతి బాణాలు సంధించడంతో బీఆర్‌ఎస్‌ ఆత్మరక్షణలో పడింది. ముఖ్యంగా హరీశ్‌ను టార్గెట్ చేయడం కాంగ్రెస్ శిబిరంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే అధికారం చేజారి, ఎంపీ ఎన్నికల్లో ఘోర ఓటమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కారు పార్టీకి.. ఆమె వ్యాఖ్యలు మరింత నష్టం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓవైపు స్థానిక ఎన్నికలు, మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్ త్వరలో ఉండటంతో కవిత ఎపిసోడ్ ఆ పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్‌రావు, హరితహారం స్కీమ్‌లో సంతోష్‌రావు అవినీతి చేశారని కవిత చెప్పడంతో కాంగ్రెస్‌కు బూస్టింగ్ లభించగా, గులాబీ గూటిలో కలకలం మొదలైంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఈ అంశంపై స్పందించకపోవడం గమనార్హం. ఈక్రమంలో బీఆర్ఎస్‌కు అధికార కాంగ్రెస్‌తో పాటు కవిత ప్రత్యర్థిగా మారినట్టేనని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

- Advertisement -

జోష్‌లో కాంగ్రెస్.. డిఫెన్స్‌లో బీఆర్ఎస్

కవిత ఆరోపణలు ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు, హరితహారం కార్యక్రమాలపై కేంద్రీకృతమయ్యాయి. ‘కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు భారీగా అవినీతికి పాల్పడ్డారు. అదే విధంగా హరితహారం పేరుతో సంతోష్ రావు అక్రమాలు చేశారు’ అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్యలోని అంతర్గత విభేదాలను మరింత బయటపెడుతున్నాయి. కవిత గతంలోనూ పార్టీలో తన స్థానం, రాజకీయ భవిష్యత్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హరీశ్‌ను టార్గెట్ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాస్త్రంగా మారాయి. ‘బీఆర్‌ఎస్ అవినీతి రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కవిత ఆరోపణలు మా పోరాటానికి బలం చేకూర్చాయి’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు స్పందిస్తున్నారు. పార్టీ కేడర్‌లో ఉత్సాహం పెరిగింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఈ ఆరోపణలు ఓటర్ల మనసు మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి ఇది ప్లస్ పాయింట్‌గా మారనుంది. మరోవైపు, బీఆర్‌ఎస్‌లో ఇది భారీ దెబ్బ తీసింది. గులాబీ గూటిలో కలకలం రేగింది. ఆ పార్టీ నేతలు కవిత ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కవిత ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకొచ్చాయి. కాంగ్రెస్‌కు ఇది బూస్టింగ్ ఇస్తుండగా, బీఆర్‌ఎస్ మాత్రం డిఫెన్స్‌లో పడింది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి పరిణామాలు తీసుకువస్తుందో చూడాలి.

కవిత విమర్శలే కాంగ్రెస్‌కు బలం

స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కవిత ఆరోపణలు కాంగ్రెస్‌కు ఊపునిస్తున్నాయి. ‘కవిత ఒకవిధంగా మా స్టార్ క్యాంపెయినర్‌గా మారారు. ఆమె ఆరోపణలు ఓటర్ల మనసు మార్చే శక్తి కలిగి ఉన్నాయి’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలతో బీఆర్‌ఎస్ రక్షణాత్మక ధోరణిలో పడింది. పార్టీలో అంతర్గత అసంతృప్తి, విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు కవిత వ్యాఖ్యలను కాంగ్రెస్‌కు అనుకూలమైన రాజకీయ ఆయుధంగా అభివర్ణిస్తున్నారు. ‘కవిత ఆరోపణలు బీఆర్‌ఎస్‌కు ఎన్నికల సమయంలో భారీ రాజకీయ నష్టం కలిగించవచ్చు. ఇది కాంగ్రెస్‌కు ఎన్నికల్లో అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తోంది’ అని ఓ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు. మొత్తంగా, కవిత వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు ఊతమిస్తూ, బీఆర్‌ఎస్‌ను డిఫెన్స్‌లో పడేశాయి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad