తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో,
యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన నాడే.. భారత దేశానికి సంపూర్ణ క్రాంతి చేకూరుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంట పొలాల నుంచి ధాన్యపు రాశులు ఇండ్లకు చేరుకున్న శుభ సందర్భంలో రైతన్న జరుపుకునే సంబురమే సంక్రాంతి పండుగని, నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ అని సీఎం అన్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని పునురుజ్జీవింప చేసేందుకు చేపట్టిన కార్యాచరణతో తెలంగాణ పల్లెలు పచ్చని పంట పొలాలు, ధాన్యరాశులు, పాడి పశువులు, కమ్మని మట్టివాసనలతో సంక్రాంతి శోభను సంతరించుకుని వైభవోపేతంగా వెలుగొందుతున్నాయని సీఎం పేర్కొన్నారు.