Fake gold biscuit scam : అదృష్టం తలుపు తట్టిందని ఆనందపడింది.. కానీ అది దొంగల రూపంలో వచ్చిన దౌర్భాగ్యమని గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రోడ్డుపై దొరికిన బంగారు బిస్కెట్‌తో రాత్రికి రాత్రే లక్షాధికారి కావొచ్చని ఆశపడిన ఓ మహిళ, కేటుగాళ్ల చేతిలో చిక్కి నిలువునా మోసపోయింది. అచ్చం సినిమా కథలా సాగిన ఈ ఘటనలో, పక్కా ప్రణాళికతో మహిళను బురిడీ కొట్టించిన ముఠా నగదు, నగలతో ఉడాయించింది. అసలు ఆ కేటుగాళ్లు పన్నిన పక్కా ప్లాన్ ఏంటి? అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఎలా దోచుకున్నారు?
పక్కా ప్రణాళిక.. పక్కదారి పట్టించి : కొణిజర్ల మండలానికి చెందిన పద్మ, ఖమ్మం నగరంలోని బోసుబొమ్మ సెంటర్‌లో నివసిస్తోంది. వారం క్రితం పాత బస్టాండు నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా, ఆంధ్రాబ్యాంకు సమీపంలో రోడ్డుపై ఓ పొట్లం కనిపించింది. పద్మ దాన్ని తీసుకుంటున్న సమయంలోనే, మరో మహిళ అక్కడికి వచ్చి, “ఆ పొట్లం నేను కూడా చూశాను, అందులో నాకూ వాటా ఉంది,” అని పట్టుబట్టింది. ఇద్దరూ కలిసి దాన్ని తెరవగా, లోపల బంగారు బిస్కెట్ మెరుస్తూ కనిపించింది.
రంగంలోకి ‘నకిలీ నిపుణుడు’ : ఇద్దరి మధ్య వాటా గురించి చర్చ జరుగుతుండగానే, అక్కడే ఉన్న ఓ వ్యక్తి వారి వద్దకు వచ్చాడు. “నేను బంగారు దుకాణంలో పనిచేస్తాను, ఇది పది తులాల మేలిమి బంగారం బిస్కెట్, దీని విలువ రూ.10 లక్షలకు పైనే ఉంటుంది” అని నమ్మబలికాడు. అతని మాటలతో పద్మకు ఆశ రెట్టింపయ్యింది. వెంటనే రెండో మహిళ, “ఈ బిస్కెట్ మొత్తం నువ్వే తీసుకో, నాకు నా వాటాగా రూ.5 లక్షలు ఇచ్చెయ్” అని పద్మకు బంపర్ ఆఫర్ ఇచ్చింది.
ఆశే అదనుగా దోపిడీ : లక్షల విలువైన బంగారం చౌకగా వస్తోందన్న ఆశతో పద్మ వెంటనే అంగీకరించింది. తన దగ్గరున్న రూ.10 వేల నగదు, మెడలోని 2 తులాల బంగారు గొలుసును అడ్వాన్సుగా ఆ మహిళకు ఇచ్చేసింది. మిగిలిన డబ్బు తీసుకురావాలని, తాము సమీపంలోని కేశవరావు పార్కు వద్ద వేచి ఉంటామని చెప్పడంతో పద్మ ఇంటికి బయలుదేరింది.
“స్థానిక దుకాణంలో బిస్కెట్‌ను పరీక్షింపజేస్తే పోలీసులకు తెలిసిపోతుందని, తక్కువ ధరకు అడగవచ్చని వారు పద్మను భయపెట్టారు. ఆ వ్యక్తి తాను బంగారు షాపులో పనిచేస్తానని చెప్పి, అది అసలు బంగారమేనని నమ్మించాడు. ఆమె దగ్గర సొమ్ములు, నగదు తీసుకుని ఉడాయించారు.”
– మోహన్ బాబు, సీఐ, ఖమ్మం మూడోపట్టణ పోలీస్ స్టేషన్
బంగారం కాదు.. ఇనుప ముక్క : డబ్బు కోసం ఇంటికి వెళ్లే దారిలో పద్మకు ఓ అనుమానం వచ్చింది. నిర్ధారణ కోసం ఓ నగల దుకాణంలో ఆ బిస్కెట్‌ను చూపించగా, అసలు విషయం తెలిసి ఆమె కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. అది బంగారం కాదని, బంగారు పూత పూసిన ఇనుప ముక్క అని తేలడంతో తాను దారుణంగా మోసపోయానని గ్రహించి లబోదిబోమంది. వెంటనే ఖమ్మం మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల ఫొటోలను విడుదల చేసి, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇలాంటి సరికొత్త నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.


