నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముంపు ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మోతినగర్, పద్మావతి నగర్, బొక్కలగడ్డ, ఆర్‌టిసి కాలనీల్లో పర్యటించి ముంపుకు గురయిన ఇండ్ల నుండి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ఇంకా ఇండ్లలోనే ఉన్న వారిని గుర్తించి వారికి ముంపుపై అవగాహన కల్పించి, కేంద్రాలకు తరలి వెళ్ళేవిధంగా చర్యలు చేపట్టారు.
మున్నేరు ప్రవాహం గురువారం ఉదయం 25 అడుగుల నుండి మధ్యాహ్నం 3 గంటలకు 30 ఆడుగులకు చేరుకున్న నేపథ్యంలో, ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ఆస్థి, ప్రాణ నష్టం జరగకుండా నివారించేందుకు, ఎలాంటి నష్టం వాటిల్లకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ జిల్లా యంత్రాంగానికి సహకరించి వెంటనే ప్రభుత్వం కల్పించిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలన్నారు. కాల్వ ఒడ్డులోని ప్రభుత్వ నయాబజార్ పాఠశాల, రామన్నపేటలోని ప్రభుత్వ పాఠశాల, ఖమ్మం రూరల్ లో రామలీల ఫంక్షన్‌హాలు, పోలేపల్లిలోని సాయిబాబా టెంపుల్, ధంసలాపురంలోని కందగట్ల ఫంక్షన్ హాళ్లలో ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని వసతులకు కల్పించామని, ప్రజలెవ్వరు అందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. జిల్లా యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలతో అప్రమత్తంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు.
లోతట్టు ప్రాంతాలను గుర్తించి 40 మంది గజ ఈతగాళ్ళను మోహరించడంతో పాటు బోట్, తెప్పలను ఏర్పాటు చేసి వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షితంగా చేర్చుతున్నట్లు ఆయన అన్నారు. బొక్కలగడ్డలో 50 మందిని, పెద్ద తండా కె.బి.ఆర్. నగర్‌లో 40 మందిని, పద్మావతి నగర్ వద్ద 50 మందిని లోతట్టు ప్రాంతాల నుండి బోట్ పై తీసుకు వచ్చామని ఆయన తెలిపారు. పునరావాస కేంద్రాలలో వెయ్యి మందికి పైగా తరలించామన్నారు. మున్నేరు ప్రవాహం వెంబడి సారధినగర్, ధాంసలాపురం కాలని, బొక్కలగడ్డ, పద్మావతి నగర్, ప్రశాంతి నగర్, ఆర్టీసీ కాలని, జలగం నగర్, నాయుడుపేట, టిఎన్జీవోస్ కాలని, మోతినగర్ తదితర ప్రాంతాలు ముంపుకు గురయ్యాయన్నారు. రాగల 24 గంటలు భారీ వర్ష సూచన ఉన్నట్లు, ఎగువనుండి వరద పోటెత్తుతున్నందున ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెంటనే తరలివెళ్లాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, అడిషనల్ డిసిపి సుబాష్ చంధ్రబోస్, రెవెన్యూ, పోలీసు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు వున్నారు.