బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఆమె తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినట్లు జరుగుతున్న ప్రచారంపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు. కవిత లేఖ అనేది ఓ డ్రామా అని కొట్టిపారేశారు. కుటుంబ పార్టీలతో రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా ప్రమాదమని తెలిపారు. బీఆర్ఎస్ అంటే.. డాడీ, డాటర్, సన్ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఆ పార్టీని తెలంగాణ సమాజం ఎప్పుడో తిరస్కరించిందన్నారు. మునిగిపోయిన పార్టీ గురించి మాట్లాడుకోవడం కూడా దండగ అని విమర్శించారు.
ఇక కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో రూ.200 కోట్లతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ మిల్లెట్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సెంటర్‌ను కేంద్ర వ్యవసాయశాఖ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. చిరుధాన్యాలపై పరిశోధన, ఉత్పత్తిలో హైదరాబాద్ కేంద్రం కీలకం కానుందన్నారు. రైల్వే రక్షణకు సంబంధించిన కవచ్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు కానున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.