తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో నిర్మించిన డబుల్ ఇండ్ల పంపిణీని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో కలిసి రాజేంద్రనగర్ నియోజకవర్గం 500 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ బీఆర్ఎస్ సర్కార్ మాత్రం పేదలను గుండెల్లో పెట్టి చూసుకుంటుందన్నారు. ఇవాళ ప్రతిపక్షాలు అనేక రకాల మాటలు చెప్తూ ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నాయి. మీరు ఆలోచించండి.. ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి కార్యక్రమం తెచ్చింది కేసీఆర్ కాదా..? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. బస్తీ దవఖానాల్లో పేద రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఉచితంగా మంచినీళ్లు అందిస్తున్నాం. గత ప్రభుత్వాల హయాంలో నల్లా బిల్లు కట్టకపోతే తెల్లారేసరికి కనెక్షన్ కట్ చేసేవారు. కేసీఆర్ హయాంలో మంచినీళ్లు అందించాం.
కాంగ్రెస్, బీజేపీ నేతలు మాటలు చెప్పారు.. కానీ చేసి చూపించలేదు అని మండిపడ్డారు. ఇవాళ పనిచేసే వారెవరో, మాటలు చెప్పే వారెవరో దయచేసి ఆలోచించి రాబోయే రోజుల్లో కూడా సరియైన నిర్ణయం తీసుకొని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రాజేంద్రనగర్ జిహెచ్ఎంసి సర్కిల్ డిసి రవికి ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు..