తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy), బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harishrao) మధ్య వాడీవేడి చర్చ జరిగింది. నల్గొండ(Nalgonda) జిల్లాలో నీటి సమస్యపై కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఓ వైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ మురుగునీటితో ప్రజలు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో 70శాతం పూర్తిచేసిన ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 40లక్షల మంది జీవితాలను కాపాడాలని జలవనరులశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోమటిరెడ్డి కోరారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ఎస్సారెస్పీ స్టేజ్-2 పనులు పూర్తిచేసి కాళేశ్వరం జలాలను ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ ప్రజలకు అందించామన్నారు. దీనిపై చర్చ పెట్టాలని ఎవరేం చేశారో చర్చిద్దామన్నారు. గతంలో కోమటిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే మూసీ ఈవిధంగా తయారైందని విమర్శించారు.
అనంతరం కోమటిరెడ్డి హరీశ్ రావు వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. అసలు హరీశ్‌రావు బీఆర్ఎస్ డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా? ఏ హోదాలో మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత ఏడాదిగా సభకు రాకపోవడం.. తెలంగాణ ప్రజలను అవమానపరచడమే అన్నారు. నల్గొండ ప్రజల గురించి, తన గురించి సభలో మాట్లాడే నైతిక హక్కు హరీష్ రావుకు లేదని మండిపడ్డారు.