పరీక్షలో పాసై మద్నూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అయిన అయిల్వార్ సౌజన్య (Ailwar Soujanya) రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy). ఈ రోజు మంత్రుల నివాస సముదాయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తో కలిసి కామారెడ్డి జిల్లా, మద్నూర్ మార్కెట్ ఛైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా.. మంత్రిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న అయిల్వార్ సౌజన్య (Ailwar Soujanya) ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందించారు. రాజకీయాల్లో ఎక్కడో ఒకచోట మార్పు మొదలు కావాలని.. అది సౌజన్య నుంచే మొదలైందని.. అందరు ఈ విధానాన్ని పాటిస్తే ప్రజలకు జవాబుదారిగా ఉండొచ్చని ఆయన అన్నారు.
సాధారణంగా రాష్ట్రంలో ఏ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎన్నిక అయినా.. స్థానిక ఎమ్మెల్యేనో, మంత్రో సిఫారసు చేస్తారని.. కానీ, పరీక్షలు నిర్వహించి ప్రతిభ కలిగినవాళ్లు, చదువుకున్నవాళ్లు ఛైర్మన్ కావాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మంచి ప్రయత్నం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందించారు. మూడు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముగ్గురు సీనియర్ లీడర్లతో కలిపి మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎన్నికకు కమిటీ వేసి, ప్రశ్నపత్రం రూపొందించి.. అందులో ఎక్కువ మార్కులు వచ్చిన టాపర్ ని ఛైర్మన్ చేయడం సాహసోపేతమైన నిర్ణయమని, ఇది సమకాలిన రాజకీయాల్లో ఒక నూతన ఒరవడికి నాంది పలుకుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ ఎమ్మెల్యే ఇదే విధంగా ప్రయత్నిస్తే.. రైతులకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు.
అంతేకాదు, పంచాయితీ నిధులు దుర్వినియోగం కాకుండా గ్రామంలో నలుగురు వాలంటీర్లతో ఒక పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసి అభివృద్ధి నిధులు పక్కదారి పట్టకుండా మంచి ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావును మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొనియాడారు. రాజకీయాల్లో పారదర్శకత, జవాబుదారితనం లేకపోవడంతో దేశం వెనకబాటుకు గురవుతుందని, విద్య పెరిగిన ఈ రోజుల్లో ఇటువంటి ప్రయత్నాలు కారు చీకటిలో వెలుగుదివ్వెలుగా సమాజానికి మంచి సందేశం ఇస్తాయని ఆయన ప్రశంసించారు. డబ్బు ప్రమేయం పెరిగిపోయిందని రాజకీయాలకు దూరంగా ఉంటున్న యువతకు రాజకీయాల పట్ల ఒక నమ్మకాన్ని కలిగిస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతోషంవ్యక్తం చేశారు.