Saturday, November 23, 2024
HomeతెలంగాణKonaraopeta: ప్రారంభం ఘనం, కొనుగోళ్లు శూన్యం

Konaraopeta: ప్రారంభం ఘనం, కొనుగోళ్లు శూన్యం

లారీలు రాక ధాన్యం సరఫరా కాక కొనుగోళ్లు నిలిచిపోయి రైతన్నలు అరిగోసపడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి చూపించిన ఉత్సాహం, వరి ధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్ కు తరలించడంలో చూపించలేక పోతున్నారని విమర్శలు వస్తున్నాయి. అధికారుల అలసత్వంతో కొనుగోళ్లు మందకొడీగా సాగుతున్నయి. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నాయి. కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని తరలించడానికి లారీల కొరత తీవ్రంగా ఉండడంతో తరుగు వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తరలించడానికి లారీలు రాకపోవడంతో కొనుగోలు ప్రక్రియను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిలిపివేశారు. ఇంత జరుగుతున్నా ధాన్యం తరలించడానికి టెండర్ దక్కించుకున్న ట్రాన్స్ పోర్ట్ నిర్వాహకులు పట్టించుకున్న పాపాన పోలేదు. నిర్లక్ష్యం ఎవరిదైనా ఫలితం మాత్రం రైతులు అనుభవిస్తున్నారు.కుటుంబ సమేతంగా కొన్ని రోజులుగా తిండి, నిద్ర లేక కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు కాస్తున్నారు.రైతులు వరి నాట్లు వేసినప్పటి నుండి రకరకాల తెగుళ్ల బారినుండి కాపాడుకోవడానికి నానారకాల ఎరువులు వాడి పంటలను కాపాడుకున్నారు. వరి పంట కోత దశకు వచ్చిన తరుణంలో అకాల, వడ గండ్లవర్షంతో సగానికి పైగా దిగుబడి తగ్గగా మిగిలిన ధాన్యన్ని కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే కొనుగోలు సక్రమంగా లేక సతమతమవుతున్నారు. ఒక బస్తాకు 44 కిలోల తూకం వేస్తేనే ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటామని మిల్లర్ లు రోజుల తరబడి ధాన్యాన్ని లారీల్లోనే నిలిపి వేస్తున్న కూడా మిల్లర్ లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన వరి ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. మండలం వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు సుమారుగా 190వేల క్వింటాళ్ల వరి ధాన్యం నిల్వ ఉంది. నిల్వ ఉన్న వరి ధాన్యాన్ని రైస్ మిల్ కు తరలంచడానికి సుమారుగా 300లారీలు అవసరం ఉన్నాయి. ధాన్యాన్ని తరలించడం కోసం రైతులు జిల్లా కేంద్రాలలో రోడ్ల వెంబడి పడిగాపులు కాస్తున్న ఒక్క లారీ కుడా దొరకడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం కొనుగోళ్ల ప్రక్రియలో విఫలం అయ్యారని ప్రతి పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ, ట్రాన్స్ పోర్ట్ అధికారులు నిర్లక్ష్యం వీడి నష్ట పోతున్న రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. లారీల కొరతపై అధికారులు దృష్టిసారించి కొనుగోలు కేంద్రాలలో ఉన్న వరి ధాన్యపు నిల్వలను రైస్ మిల్ కు చేరవేసి, కొనుగోళ్లు వేగవంతం చేసి, రైతులను కాపాడాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News