నాడు సమైక్య పాలనలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు నేడు రైతులకు మూడు గంటల కరెంట్ చాలని మాట్లాడుతున్న పిసిసి ప్రెసిడెంట్ రెవంత్ రెడ్డి చంద్రబాబుకు వారసుడని, రైతు కంటక కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బొంద పెట్టాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రైతులకు పిలుపునిచ్చారు.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి రైతు వేదికలో రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులు ట్రాక్టర్లతో ఎమ్మెల్యే కోరుకంటికి ఘన స్వాగతం పలికారు. కోరుకంటి ముందు ట్రాక్టర్ నడుపుతుండగా వెనక ట్రాక్టర్లతో రైతులు రైతువేదిక వరకు ర్యాలీగా బయలుదేరారు. రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం 60 ఏళ్ల కాలంలో తెలంగాణను పాలించిన పార్టీలుగానీ, నాయకులుగానీ ఎవరు కూడా రైతు సంక్షేమం పట్ల ఆలోచన చేయలేదన్నారు. నాడు కరెంటు అడిగినందుకు రైతులను కాల్చి చంపించిన చంద్రబాబు వ్యవసాయం దండగన్నాడని, ఆ చంద్రబాబు వారసుడు రేవంత్ రెడ్డి నేడు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అక్కర్లేదు, మూడు గంటలు చాలంటున్నాడని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు లేదు, నీళ్లు లేవు, ఎరువులు లేవని, ఎమ్మార్వో ఆఫీసుల్లో, పోలీస్ స్టేషన్లలో ఎరువులనుంచి అమ్మిస్తే, రైతులు రోజుల తరబడి లైన్లో ఉండి పడిగాపులు కాసిన పరిస్థితిని గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఎప్పుడొస్తుందో తెలియని కరెంటు కోసం రైతులు రాత్రులు పొలాల దగ్గర పడుకునే వారని, పాములు, తేలు కాట్లకు, కరెంటు షాక్ కు గురై చనిపోయిన సందర్భాలను చూసామన్నారు. సిఎం కేసీఆర్ పాలనలో 24 గంటల ఉచిత కరెంటుతో రైతులు పంట పొలాల దగ్గర అర్ధరాత్రి పడుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబం దిక్కులేనిది కాకూడదనే ఉద్దేశంతో 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ను రైతు బీమాగా అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్నారు. 2018 నుండి ఈ క్లస్టర్ పరిధిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన 54 మంది రైతులకు 2కోట్ల 70లక్షల రూపాయలు రైతు బీమాగా అందించామన్నారు.
ప్రతి ఎకరాకు నీళ్లు, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న కెసిఆర్ పాలనలోని బిఆర్ఎస్ ప్రభుత్వమే రైతు సంక్షేమ ప్రభుత్వమన్నారు. 24 గంటల ఉచిత కరెంటు అవసరంలేదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతాంగాన్ని అవమాన పరచడమేనన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన ఎల్లంపల్లి ప్రాజెక్టుతో ఎల్లంపల్లి ముర్మూరు రైతులు రోడ్డున పడ్డారని, ఒక చుక్క నీరు ఇవ్వకుండా రైతులను అరిగోస పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ కూడా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కొంతమంది రైతులకు అందలేదని అన్నారు. కానీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రూ.80 కోట్లతో 27ఎల్ లిఫ్ట్ ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందుతుందని అన్నారు. అభివృద్ధి సంక్షేమం గురించి తెలియనోళ్లు నోటికి ఏది వస్తే వాగితే సహించేదిలేదని హెచ్చరించారు. రైతన్న రాజుగా వర్ధిల్లాలని దృఢ సంకల్పంతో.. రైతన్న సంక్షేమం కోసం సిఎం కేసీఆర్ అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి 60 ఏళ్ల గ్రహణం పట్టి అభివృద్ధి నోచుకోలేక పరిస్థితిలో ఉండేదని, కానీ సిఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల కాలంలోనే వందేళ్ల ప్రగతి సాధించారని అన్నారు. తెలంగాణ రైతన్న జీవితాలు పచ్చగా సంతోషంగా కొనసాగుతుంటే ఓర్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ వ్యతిరేక విధానాలతో ప్రజల్లోకి వస్తుందన్నారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి, రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు పంటలు బిఆర్ఎస్ నినాదం.. మూడు గంటల కరెంటు కాంగ్రెస్ విధానమని, కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలో! కరెంట్ వెలుగుల బిఆర్ఎస్ కావాలో! తెలంగాణ రైతులు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అంతేకాకుండా తన్నల మోటార్లకు మీటర్లు బిగించాలని బిజెపి పూరితమైన ఆలోచనలు చేస్తుందని అన్నారు. తెలంగాణలోని రైతన్నల సంక్షేమాంపై దేశంలోని రైతన్నల చూపు పడిందని.. సీఎం కెసిఆర్ పాలనను కోరుకుంటున్నారని ఆయన అన్నారు. రైతన్నల సంక్షేమంపై కుట్రపూరిత ఆలోచనలు చేస్తే రాబోయే కాలంలో ప్రజలు కాంగ్రెస్ బిజెపి లను స్థాపితం చేస్తాయని ఆయన అన్నారు. 60 ఏళ్ల కాలంలో మారని నిరుపేద బతుకులు.. కేవలం 9 ఏండ్ల కాలంలో సంక్షేమం వైపు అడుగులు తీస్తుండటం సీఎం కెసిఆర్ తోనే సాధ్యమైందని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని ఆయన అన్నారు. కొంతమంది నాయకులు పనిగట్టుకొని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని.. ఇకనైనా మానుకోకపోతే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా ఇల్లు లేని వారికి గృహలక్ష్మి పథకం పేరుతో రూ. మూడు లక్షల ఆర్థిక సహాయాన్ని అందచేయానున్నట్లు ఆయన తెలిపారు. 24 గంటల కరెంటునిచ్చే కెసిఆర్ ప్రభుత్వమే మళ్ళీ కావాలని రైతులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తెలంగాణలో గొప్ప పాలను కొనసాగిస్తున్న కేసీఆర్ కు రాబోయే కాలంలో మద్దతుగా నిలిచి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా గులాబీ సైనికులు పార్టీ పటిష్టత కోసం, బలోపేతం కోసం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అంతర్గాం ఎంపీపీ దుర్గం విజయ జడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి మహేందర్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు దివాకర్, మండల కో ఆప్షన్ సభ్యులు గౌస్ పాషా , సర్పంచ్లు బండారి ప్రవీన్ ధరని రాజేశ్, దేవమ్మ రాములు, మెరుగు పోశం, రవీందర్, బాదరవేని స్వామి, ధర్మాజీ కృష్ణ, తుంగపిండి సతీష్ ఎంపిటిసీ మస్కం శ్రీనివాస్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి నాయక్, నాయకులు ఎదులపూరం వెంకటేష్ కోలిపాక మధుకర్ రెడ్డి కోల సంతోష్ గౌడ్ కుర్ర నూకరాజు, గీట్ల శంకర్రెడ్డి కుర్ర సన్నీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.