రైతులకు ఎప్పటి నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఒక ఎకరానికి రూ.17,500 చొప్పున రైతుబంధు బాకీ పడిందన్నారు. ఒక్కో రైతుకు, ఎన్ని ఎకరాలకు ఎంత బాకీ ఉందో ఈ పోస్టర్లు ఊరూరా వేస్తామని తెలిపారు. ప్రభుత్వం దగ్గర రైతుల పూర్తి వివరాలు ఉన్నప్పుడు మళ్లీ ప్రమాణ పత్రాలు ఎందుకు అని ప్రశ్నించారు. అసలు రైతు భరోసా ఎవరికీ ఇస్తారో స్పష్టంగా చెప్పాలన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు పంపిణీలో రూ.22 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో చెప్పాలని ప్రశ్నించారు. పత్తి, కంది, చెరకుకు రెండో పంట ఉండదని.. అయినా రైతుబంధు ఇచ్చామని చెప్పారు. కానీ రెండు పంటలు పండే ఫామాయిల్, మామిడి, బత్తాయి, నిమ్మ తోటలను ఒకే పంటగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు.
రైతును రాజు చేయాలన్నది కేసీఆర్ ప్రయత్నం అయితే.. రైతును బిచ్చగాణ్ణి చేయాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ప్రజా పాలనలో 1.6 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారని ఇక మళ్లీ ప్రమాణపత్రం ఎందుకుని నిలదీశారు. గ్రామాల వారీగా రుణమాఫీ జాబితాలు పెట్టాలని కేటీఆర్ పేర్కొన్నారు.