Friday, May 9, 2025
HomeతెలంగాణKTR: తెలంగాణ బడ్జెట్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

KTR: తెలంగాణ బడ్జెట్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

తెలంగాణ బడ్జెట్‌(Telangana Budget)పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్(KTR) తీవ్ర విమర్శలు చేశారు. ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదని.. ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో తెలంగాణలోని ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆరు గ్యారంటీలు గోవిందా అని అర్థమైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ మర్చిపోయిందని విమర్శించారు. ఏడాది దాటినా ఉద్యోగాల ఊసేలేదని.. దమ్ముంటే రాహుల్ గాంధీ అశోక్‌ నగర్‌కు రావాలని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను తామే ఇచ్చినట్టు కాంగ్రెస్‌ నేతలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కొంచెమైనా సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

- Advertisement -

ఈ బడ్జెట్ చూసిన తర్వాత మహిళలు, వృద్ధులు నిరాశకు గురయ్యారన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలకు బడ్జెట్‌లో ఎక్కడ నిధులు కేటాయించలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తులం బంగారం పథకం, రూ.4000 పింఛన్, మహిళలకు రూ.2500 వంటి పథకాలకు ఈ బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు చేయలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. పీఆర్సీకి సంబంధించి ఎలాంటి ప్రకటనలేదని కామెంట్స్‌ చేశారు. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది.. ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో చేనేతకు రూ.1200 కోట్లు కేటాయిస్తే.. ఇప్పుడు చేనేత కార్మికులకు రూ.300 కోట్లకు పరిమితం చేశారని ఫైర్ అయ్యారు. ఆటో కార్మికుల గురించి ప్రస్తావనే లేదన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News