తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదానీ గ్రూప్‌తో కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాలను రద్దు చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. అలాగే స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ (Adani Group) ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని వెనక్కి ఇవ్వాలని సూచించారు. భారత దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో అవినీతి, లంచం ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ డిమాండ్లను లేవనెత్తారు.
అదానీ విషయంలో కాంగ్రెస్, బీజేపీ తమ వైఖరిని స్పష్టం చేయాలని కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… నేరారోపణలు వచ్చిన వెంటనే అదానీతో కెన్యా వంటి చిన్న దేశాలు తమ ఒప్పందాలను రద్దు చేసుకున్నాయన్నారు. తెలంగాణ ఎందుకు అలా చేయకూడదు? అని ప్రశ్నించారు.
“కెన్యా దేశపు తలసరి ఆదాయం 2000 డాలర్లు.. అదే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 5000 డాలర్లు.. అలాంటి కెన్యా దేశపు అధ్యక్షుడు, అదానీ లంచగొండి అని తెలిసాక అతనితో వ్యాపారాలు రద్దు చేసాడు. కానీ రోజూ అదానీని తిట్టే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇంకా అదానీతో ఎంవోయూలు ఎందుకు రద్దు చేసుకోలేదు? అని నిలదీశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు అదానీతో తమకున్న అనుబంధాన్ని బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.