ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ను ఈడీ విచారిస్తోంది. ఈ రేసుకు సంబంధించి నిధుల బదిలీపై అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్(Gandhi Bhavan) వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు గాంధీ భవన్‌ను ముట్టడించే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను పెంచారు. కార్యాలయం నాలుగు గేట్ల వద్ద పోలీసులు మోహరించారు.
మరోవైపు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయానికి వెళ్లే రహదారికి ఇరువైపులా పోలీసులు మోహరించారు. ఈడీ విచారణ పూర్తయ్యే వరకూ రెండు పార్టీ కార్యాలయాల వద్ద భద్రతను పటిష్ఠం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసు వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. దాదాపు 200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.