KTR on kcr kits: కేసీఆర్ కిట్ల పంపిణీని ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని ఆపివేసిందని ఆయన ఆరోపించారు.
బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కిట్లు మాతా శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించాయని, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచాయని కేటీఆర్ గుర్తు చేశారు. గత 20 నెలలుగా కేసీఆర్ కిట్లు పంపిణీ చేయకపోవడంతో ఎంతో మంది తల్లులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నెల 24న తన పుట్టినరోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో కొంతమంది తల్లులకు కేటీఆర్ కేసీఆర్ కిట్లను అందజేశారు. తన పుట్టినరోజు సందర్భంగా సిరిసిల్లలో 5 వేల మంది తల్లులకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.
2014కు ముందు ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటే భయపడేవారని, కానీ కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారి, ప్రజలు వాటిని ఆశ్రయించడం మొదలుపెట్టారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కిట్లను 20 నెలలుగా నిలిపివేయడం దుర్మార్గమైన చర్య అని, కేసీఆర్‌పై ఉన్న అంతులేని ద్వేషమే దీనికి కారణమని ఆయన విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు మధుసూదనాచారి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ కిట్ అనేది తెలంగాణ ప్రభుత్వం గర్భిణీ స్త్రీలు, తల్లులు మరియు నవజాత శిశువుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఒక పథకం. ఇది జూన్ 2, 2017 తేదీన ప్రారంభించబడింది. ప్రసవాల కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే మహిళలకు ఆర్థిక సహాయంతో పాటు అవసరమైన వస్తువులతో కూడిన కిట్ ను అందించి, ప్రైవేటు ఆసుపత్రుల పై ఆధారపడటాన్ని తగ్గించడం. తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా మాతా శిశు మరణాల రేటు (MMR & IMR) తగ్గించడం కోసం ఇది స్టార్ట్ చేశారు. గర్భిణీలకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా రక్తహీనత వంటి సమస్యలను తగ్గించడం. ప్రసవం తర్వాత తల్లికి, బిడ్డకు అవసరమైన సంరక్షణను అందించడమే లక్ష్యంగా తీసుకొచ్చినట్టు అప్పటి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కేసీఆర్ కిట్ ద్వారా గర్భిణులకు రూ. 12,000 ఆర్థిక సహాయం మూడు విడతల్లో అందించే వారు. ఆడపిల్ల పుడితే అదనంగా రూ. 1,000 కలిపి మొత్తం రూ. 13,000 అందించేవారు. గత రెండేళ్లుగా ఈ పథకం కొనసాగడం లేదు.


