బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఒకే కారులో ప్రయాణించారు. కేటీఆర్ డ్రైవింగ్ చేస్తుండగా.. హరీష్ పక్క సీట్‌లో కూర్చున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను కేటీఆర్, హరీష్ రావు పరామర్శించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి ఇద్దరు కారులో నాగర్ కర్నూల్‌కు కలిసి వెళ్లారు.
కాగా బీఆర్ఎస్‌లో కేటీఆర్, హరీష్ రావు వర్గాలు ఉన్నాయి. ఇద్దరు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు కుట్రలు పన్నుతూ ఉంటారని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం విధితమే. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడంతో పాటు సీఎం చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని.. అందుకే హరీష్ రావును పక్కన పెడుతున్నారనే ఆరోపణలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆరోపణలు వారిద్దరు ఖండిస్తూనే ఉన్నారు. తాజాగా ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రయాణించడంతో గులాబీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.