ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. 6 గంటల పాటు ఏసీబీ కేటీఆర్ ను విచారించింది. విచారణ అనంతరం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను జైలులో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇక ఏసీబీ అధికారులు 80కి పైగా ప్రశ్నలు అడిగారని.. అడిగినవే మళ్లీ మళ్లీ అడిగారని తెలిపారు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని.. విచారణకు సహకరించానని పేర్కొన్నారు. ఏసీబీ ఎన్నిసార్లు పిలిచినా, ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని ఆయన స్పష్టం చేశారు.
ఇక ప్రభుత్వ ఒత్తిడితోనే ఏసీబీ అధికారులు తనను విచారించారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి రాసిన ప్రశ్నలను ఏసీబీ అధికారులు చదివి వినిపించారని విమర్శించారు. మళ్లీ విచారణకు ఎప్పుడు పిలుస్తారో చెప్పలేదని తెలిపారు. తనకు గుర్తు ఉన్నంతవరకు సమాచారం ఇచ్చానని పేర్కొన్నారు. ఈ కేసులో అసలు విషయమే లేదని కేటీఆర్ అన్నారు. ఈ కార్ రేస్ ఈవెంట్ హైదరాబాద్ లోనే ఉండాలని కష్టపడి తెచ్చామని.. మొదటి సారి భారత్ కు తెచ్చామని వివరించారు.
హైదరాబాద్ ఈ కార్ రేస్ ఈవెంట్ ఉంటే.. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ ను ప్రపంచంలో ఒక స్థావరంగా చేయాలనే ఒక విజన్ తో చేసిన పని తప్ప.. ఇందులో పైసలు, అవినీతి అనేది పేర్కొన్నారు. అలాంటి పనులు సీఎం రేవంత్ రెడ్డి చేస్తారని.. తమకు అలాంటి కర్మ పట్టలేదని ఏసీబీ అధికారులకు స్పష్టం చేసినట్లు కేటీఆర్ తెలిపారు. తనపై కేసులు పెట్టి రేవంత్ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి భయపడే బీఆర్ఎస్ కార్యకర్త, నాయకుడు ఎవరూ లేరని అన్నారు.