ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ (KTR) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు(TG Highcourt)లో విచారణ ముగిసింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. ఈమేరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై గత విచారణ సందర్భంగా ఈనెల 30 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఇక తాజా విచారణ సందర్భంగా ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ ఏ.సుదర్శన్ వాదనలు వినిపించారు. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని ఆయన తెలిపారు. ఈ కేసులో కేటీఆర్ ఏ1 నిందితుడిగా కేసు నమోదైందన్నారు. అయితే దర్యాప్తు ఏ దశలో ఉందని ఈ సందర్భంగా ఏజీని హైకోర్టు ప్రశ్నించింది.
కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని.. అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ తెలిపారు. ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయలేదని.. గవర్నర్ అనుమతి తరువాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. వాడివేడి వాదనలు ముగిసిన అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.