ఫార్ములా-ఈ రేసు(Formula-E Race) వ్యవహారంలో తనపై నమోదైన కేసులో విచారణకు హాజరయ్యేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఏసీబీ(ACB) కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన వెంట లాయర్ రామచంద్రరావు ఉన్నారు. విచారణ సమయంలో తన వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు కేటీఆర్‌కు హైకోర్టు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే విచారణ గదిలోకి మాత్రం న్యాయవాదికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. విచారణను దూరం నుంచి గమనించవచ్చని పేర్కొంది.
కాగా ఈ విచారణకు బయలుదేరే ముందు నందినగర్‌లోని ఇంటి వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచపటంలో ఉంచేందుకు కృషి చేశానని తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసులో అర పైసా కూడా అవినీతి చేయలేదన్నారు. మంత్రిగా ఉంటూ కుమారుడి కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వలేదని.. అందుకు ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనలేదని ఆరోపించారు. ఆ తెలివితేటలు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సహాచరులకే ఉన్నాయని ఫైర్ అయ్యారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వ వైఫల్యాలపై కొట్లాడుతూనే ఉంటామని హెచ్చరించారు. న్యాయస్థానాలు, చట్టాలపై సంపూర్ణ విశ్వాసం, గౌరవం ఉందని కేటీఆర్ వెల్లడించారు.