KTR receives Sri Lanka invitation: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నవంబర్ 10న శ్రీలంకకు వెళ్లనున్నారు. శ్రీలంకలోని కొలంబోలో నిర్వహించే ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ 2025’ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ కీలక సదస్సులో ప్రసంగించనున్నారు. ఈ మేరకు సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆయనకు శ్రీలంక ప్రతినిధులచే ఆహ్వానం అందింది. వచ్చే నెల 10 నుంచి 12 వరకు కొలంబోలోని ‘ది కింగ్స్‌బరీ హోటల్’లో ఈ సదస్సు జరగనుంది. ఇంతటి కీలకమైన సదస్సుకు కేటీఆర్‌ను ఆహ్వానించడం పల్ల బీఆర్‌ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సదస్సుకు కేటీఆర్‌ను ఆహ్వానించడం తెలంగాణకు దక్కిన అరుదైన గౌరవంగా చెబుతున్నారు.
ఐటీ అభివృద్ధిలో కేటీఆర్ చొరవను కొనియాడుతూ..
కాగా, శ్రీలంక సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తరఫున, గెట్స్ శ్రీలంక డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఏయుఎల్ఏ హిల్మీ కేటీఆర్‌ను ఆహ్వానిస్తూ ఆహ్వానాన్ని పంపించారు. ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నాయకులను ఈ సదస్సు ద్వారా ఒకే వేదికపైకి తీసుకురానున్నట్లు నిర్వహకులు తెలిపారు. కాగా గత పదేళ్లు అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి రంగాలలో తెలంగాణను భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన కేంద్రంగా తీర్చిదిద్దారని లేఖలో ప్రశంసించారు. కాగా ఐటీ రంగంలో కేటీఆర్ పోషించిన నాయకత్వాన్ని, పాత్రను ఈ సందర్భంగా డాక్టర్ హిల్మీ తన లేఖలో కొనియాడారు. పారిశ్రామిక, సాంకేతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఆయన నడిపించిన విధానం.. అనేక వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు ఒక ఆదర్శంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ పాల్గొనడం వల్ల దక్షిణ ఆసియాలోని విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు స్ఫూర్తి పొందుతారని అందుకే ఆయనను సదస్సుకు ఆహ్వానించినట్లు సదస్సు కార్యదర్శి తెలిపారు. కాగా, కేటీఆర్‌కు గతంలోనూ అనేక ప్రతిష్టాత్మక ఆహ్వానాలు అందాయి. రిటన్‌లో జరిగే ఐడియాస్ ఫర్ ఇండియా-2025 సదస్సుకి రావాలంటూ బ్రిడ్జ్ ఇండియా సంస్థ గతంలో కేటీఆర్‌ను ఆహ్వానించింది. మే 30 తేదీన లండన్‌లోని రాయల్ లాంకాస్టర్ హోటల్లో జరిగే సదస్సుకు హాజరై ఆయన ప్రసంగించారు. 2023లో ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈసారి కూడా లండన్ వ్యాపార వర్గాలు, ఇండో -యూకే కారిడార్లోని ముఖ్య వ్యక్తులు, తెలుగు ప్రవాసులు కేటీఆర్‌ను కలవడానికి, ఆయన ప్రసంగాన్ని వినడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటికీ కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ఆహ్వానించడం పట్ల గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.


