ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే అందరూ మీలాగే బ్లాక్‌మెయిల్ దందాలు చేయరంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
“పచ్చకామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. మీరు బ్యాగులతో దొరికారని… అందరూ మీ లాగానే బ్లాక్మెయిల్ దందాలు చేస్తారని సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ బ్రతుకుతున్నారని అనుకోవడం తప్పు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మన దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముకలు. సివిల్ సర్వెంట్ల నినాదం ‘ఎక్సలెన్స్ ఇన్ యాక్షన్’. ‘ఏసీ అండ్ ఇనాక్షన్’ కాదు. వారి గురించి సీఎం మాట్లాడిన మాటలు కించపరిచేలా, అమర్యాదకరంగా ఉన్నాయి. బ్యూరోక్రాటిక్ వ్యవస్థ ప్రతిష్టను నాశనం చేసేందుకు ముఖ్యమంత్రి నిరంతరం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నా” అని ఆయన రాసుకొచ్చారు.
కాగా అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి, సమస్యలను తెలుసుకోవాలని సీఎం పలుసార్లు కలెక్టర్లు, ఎస్పీలను సీఎం చాలా సార్లు ఆదేశించారు. కానీ ఇప్పటివరకు ఒకరిద్దరు కలెక్టర్లు మాత్రమే గురుకులాలతో పాటు ధాన్యం సేకరణ కార్యక్రమంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏసీ రూంలు వదిలి క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు ఇష్టపడటం లేదని అసహనం వ్యక్తం చేశారు.