దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh)కు భారతరత్న ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన తీర్మానానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలిపారు. అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.. భారతరత్న పురస్కారానికి మన్మోహన్ పూర్తిగా అర్హులని చెప్పారు. అందుకే ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ నాయకత్వంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగిందని వెల్లడించారు.
తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో నీతి, నిజాయితీగా మన్మోహన్ సింగ్ పనిచేశారని కొనియాడారు. మన్మోహన్ కేబినెట్‌లో కేసీఆర్(KCR) ఏడాదిన్నర పాటు కేంద్ర మంత్రిగా పనిచేశారని గర్తు చేశారు. మన్మోహన్ సింగ్ ప్రతిభను గుర్తించింది తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు(PV Narsimha Rao) కావడం గర్వకారణమన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. ఆర్థిక సంస్కరణల్లో ఏమాత్రం వెనక్కి తగ్గలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.