ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు ఈ కేసుకు సంబంధించిన అంశాలపై ఆయన ట్వీట్ చేశారు. ఇందులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. త్వరలో నిజం తెలుస్తుందని పేర్కొన్నారు.
‘భారతదేశం/తెలంగాణ/హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ హోస్ట్ చేయడం మంత్రిగా నేను తీసుకున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలలో ఒకటి. అంతర్జాతీయ రేసర్లు, ఇ-మొబిలిటీ పరిశ్రమ నాయకులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసించడం గర్వించదగ్గ విషయం. నాకు బ్రాండ్ హైదరాబాద్ అత్యంత ముఖ్యమైనది. కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న పనికిమాలిన కేసులు ఆ ఘనతను తుడిచేయలేవు. బ్యాంక్-టు-బ్యాంక్ లావాదేవీ ద్వారా ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ లిమిటెడ్ కి రూ.46 కోట్లు చెల్లించబడింది. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు. ఇక ఇందులో అవినీతి, దుర్వినియోగం, మనీ లాండరింగ్ ఎక్కడ ఉంది?. ఏదైతేనేం సీఎం రేవంత్ రెడ్డి చిన్న చూపు, ఏకపక్ష నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది. తప్పకుండా త్వరలోనే నిజం తెలుస్తుంది. అప్పటి వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తాం’ అని కేటీఆర్ తెలిపారు.