Saturday, November 15, 2025
HomeతెలంగాణKurnool Bus Tragedy: బంధువులకు 18 మృత దేహాలు అప్పగింత... ఆ ఒక్కటి ఎవరిది?

Kurnool Bus Tragedy: బంధువులకు 18 మృత దేహాలు అప్పగింత… ఆ ఒక్కటి ఎవరిది?

Kurnool bus tragedy investigation : కన్నీటి సంద్రం మధ్య.. కర్నూలు బస్సు ప్రమాద మృతుల కుటుంబాల్లో విషాదం అలుముకుంది. గుర్తుపట్టలేని స్థితిలో కాలిబూడిదైన తమ వారి దేహాల కోసం రోజుల తరబడి ఎదురుచూసిన బంధువుల నిరీక్షణకు తెరపడింది. డీఎన్‌ఏ నివేదికల ఆధారంగా 18 మృతదేహాలను అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఆ పంతొమ్మిదో మృతదేహం ఎవరిది? బైకర్‌ నిర్లక్ష్యంతో జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో అసలు ఏం జరిగింది? ఆ మిగిలిన ఒక్క మృతదేహం వెనుక ఉన్న మిస్టరీ ఏంటి?

- Advertisement -

డీఎన్‌ఏతో వీడిన చిక్కుముడి : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. మృతదేహాలు పూర్తిగా దగ్ధమవడంతో వాటిని గుర్తించడం అధికారులకు పెను సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో, మృతుల బంధువుల నుంచి రక్త నమూనాలు సేకరించి, డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. ఆదివారం డీఎన్‌ఏ నివేదికలు రావడంతో, వాటి ఆధారంగా 18 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ ఎ. సిరి ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా అందజేసి, మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు.

ఆ ఒక్క మృతదేహం ఎవరిది? : మొత్తం 19 మృతదేహాల్లో 18 మందిని గుర్తించగా, ఆ ఒక్క మృతదేహం ఎవరిదనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన తండ్రి కనిపించడం లేదని, బహుశా ఈ ప్రమాదంలో మరణించి ఉండవచ్చని పోలీసులను ఆశ్రయించినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆ వ్యక్తి డీఎన్‌ఏ నమూనాలను సైతం సేకరించి, మిగిలిన మృతదేహంతో సరిపోల్చి చూస్తామని, నివేదిక వచ్చాక స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు.

బైకర్‌ నిర్లక్ష్యమే కారణమా? : ఈ ఘోర ప్రమాదానికి బైకర్ శివశంకర్ నిర్లక్ష్యమే కారణమని అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఉలిందకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. శివశంకర్ నిర్లక్ష్యం కారణంగానే బైక్ డివైడర్‌ను ఢీకొట్టిందని, ఈ ప్రమాదంలో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడని ఎర్రిస్వామి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్‌ను వేగంగా వచ్చిన బస్సు ఢీకొని, సుమారు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో నిప్పురవ్వలు చెలరేగి మంటలు అంటుకున్నాయని వివరించాడు.

ఫోరెన్సిక్ నివేదికలో సంచలనం : కర్నూలు ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (RFSL) అందించిన నివేదిక ఈ కేసులో కీలక మలుపు తిప్పింది. మృతుడైన బైకర్ శివశంకర్ నమూనాలలో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక నిర్ధారించింది. ప్రమాద సమయంలో అతను మద్యం మత్తులో వాహనం నడిపినట్లు తేలింది. అయితే, బస్సు డ్రైవర్ మద్యం సేవించలేదని నివేదికలో స్పష్టమైంది.

మెదక్ తల్లీకూతుళ్ల విషాదాంతం : ఈ దుర్ఘటనలో మెదక్ జిల్లా, శివ్వాయిపల్లికి చెందిన తల్లి మంగ సంధ్యారాణి (43), కుమార్తె మంగ చందన (23) కూడా మృత్యువాత పడ్డారు. ఒమన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భర్తతో పాటు అక్కడే నివసించే సంధ్యారాణి, బంధువుల వివాహం కోసం హైదరాబాద్ వచ్చారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న కుమార్తె చందనను అక్కడ దిగబెట్టి, తాను తిరిగి మస్కట్ వెళ్లాలని భావించారు. ఈ క్రమంలోనే వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురై, తల్లీకూతుళ్లిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad