BhanuKiran| మద్దెలచెరువు సూరి(MaddelaCheruvu Suri) హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌కు బెయిల్ లభించడంతో చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. 2011లో జనవరి 4న సూరి తన అనుచరుడు భానుకిరణ్ చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో సూరి ప్రయాణిస్తున్న కారుపై భానుకిరణ్ విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. ఆయన అక్కడికక్కడే మరణించాడు. అనంతరం పరారీలో ఉన్న భానుకిరణ్‌ను మధ్యప్రదేశ్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.
అప్పటి నుంచి భానుకిరణ్ చంచల్‌గూడ జైలులోనే ఉన్నాడు. సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి కోర్టు భానుకిరణ్‌కి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసినా అక్కడ చుక్కెదురైంది. తాజాగా సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసులో బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. దీంతో 12 ఏళ్ల నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న భానుకిరణ్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యాడు.
కాగా 2005 జనవరి 25న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో టీడీపీ సీనియర్ నేత పరిటాల రవి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా మొద్దుశీనును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ హత్యకు స్కెచ్ వేసిన మద్దెలచెరువు సూరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో భాగంగా జైలులో ఉన్న మొద్దుశీను తోటి ఖైదీ చేతిలో దారుణ హత్యకు గురి కావడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకే సూరి కూడా ఆయన అనుచరుడు భానుకిరణ్ చేతిలోనే హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది.