మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇప్పటివరకు జిల్లా పోలీస్ శాఖ సాధించిన విజయాలను, ఏర్పాటు చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు తెలిసే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. దేశంలోనే ప్రధమ స్థానంలో నిలుస్తూ, ప్రజలకు సేవలు అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను గురించి, నేరాలను అదుపుచేయడానికి అవలంబిస్తున్న విధి విధానాలను చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని తెలిపారు.అనంతరం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన పెండింగులో ఉన్న కేసుల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కేసుల సత్వర పరిష్కారానికి అధికారులందరూ కృషి చేయాలని కోరారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. షీ టీమ్స్ ఆవశ్యకత,సైబర్ క్రైమ్స్,అక్రమ మానవ రవాణా వంటి అంశాలపై అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదిలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తెలిపారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.విధుల పట్ల నిబద్ధతతో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ నేరస్తులకు శిక్ష పడే విధంగా చేస్తూ, బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా పని చేయాలని కోరారు. ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టి భాదితులకు అండగా నిలవాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ జోగ చెన్నయ్య,మహబూబాబాద్ ఇంఛార్జి డీఎస్పీ రమణ బాబు, తోర్రుర్ డిఎస్పీ రఘు, జిల్లాలోని సిఐలు,ఎ స్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.