మహిళలు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకుండా వైద్య సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె శశాంక అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళ ఆరోగ్య శ్రేయస్సే కర్తవ్యంగా ప్రతి మంగళవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమం నిర్వహణను దంతాలపల్లి పి హెచ్ సిలో జిల్లా కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. నమోదు రిజిస్టర్ ను పరిశీలించి వచ్చిన 24 మందికి ఎలాంటి పరీక్షలు సలహాలు మెడిసిన్స్ అందిస్తున్నారని, పరీక్షల నమోదును పెంచాలని, నాణ్యత ప్రమాణాలతో వైద్య పరీక్షలు సేవలు అందించాలని, వ్యాధులు ఆర్థికంగా మానసికంగా నష్టపరుస్తాయని, సమస్యలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, రోగుల పట్ల మర్యాదగా ఉండాలని సమస్యలు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ అన్నారు.
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబానికి పెద్ద ఆసరాగా ఉంటారని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వైద్యాధికారులు పరీక్షించి టెస్టులు రాసిన యెడల తప్పనిసరిగా చేయించుకోవాలని, క్రమం తప్పకుండా మందులు వాడాలని కలెక్టర్ సూచించారు. వైద్యాధికారులు ఆరోగ్య మహిళా కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వెంకటేశ్వర రెడ్డి, రైతుబంధు కోఆర్డినేటర్ మల్లారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రాము, సర్పంచ్ సుస్మిత,మెడికల్ ఆఫీసర్లు చైతన్య, స్పందన, సి హెచ్ ఓ బాలాజీ, తహసిల్దార్ శివానంద్, ఎంపీడీవో విజయలక్ష్మి, హెచ్ వీలు రమణ, సుజాత, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.