టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అధ్యక్షతన ఈరోజు గాంధీభవన్లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక అంశాలపై నేతలు చర్చించారు. ప్రజా విజయోత్సవాల గురించి, రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే గురించి చర్చలు జరిపారు. వీటి నిర్వహణకు ఎదురవుతున్న సవాళ్లు, మెరుగుపరచడానికి ఉన్న మార్గాలపైన నేతలు పరస్పర అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అలాగే త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాల పైన వ్యూహ రచనలు చేశారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) మాట్లాడుతూ… “రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో అద్భుతమైన పాలన అందించింది. దేశంలో ఏ రాష్ట్రం చేయలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మనం చేసి చూపించాం. ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అందుకోసం ప్రభుత్వం విజయోత్సవాలు చేపట్టింది. కాంగ్రెస్ కార్యకర్తలు మన ప్రభుత్వం చేసిన పనులను ఇంటింటికి తీసుకెళ్లాలి. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వంపైన విపరీతంగా దుష్ప్రచారం చెస్తున్నాయి. వాటిని తిప్పికొట్టాలి. పార్టీ కోసం పని చేసిన అందరికి పదవులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలలో పార్టీ అన్ని విధాలుగా గట్టిగా కృషి చేయాలి. మంచి ఫలితాలు రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’’ అని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, సీనియర్ నాయకులు, కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.