KTR Formula E- Car Race: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ ఖాయం అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌తో ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ, కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో నిందితుడిగా ఉన్న కేటీఆర్.. దసరా తర్వాత అరెస్టయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ అక్రమాలపై స్పష్టమైన ఆధారాలున్నాయని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
‘కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఫోన్ ట్యాపింగ్ చేసి గత ఎన్నికల్లో గెలిచారు. బీఆర్‌ఎస్ హయాంలో చాలా ఫోన్లు ట్యాపింగ్ జరిగాయి. ఫార్ములా ఈ- కార్ రేసులో కేటీఆర్ అక్రమాలపై స్పష్టమైన ఆధారాలున్నాయి. దసరా తర్వాత ఆయన అరెస్ట్ తప్పదు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అన్నిటిపై సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు బయటకి వస్తాయి.’ అని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమి ధీమా వ్యక్తం చేశారు. హైడ్రాతో సామాన్యుడికి ఇబ్బంది లేదని.. భూ కబ్జాలకు పాల్పడిన వారికే ఇబ్బందులు తప్పవని ఎద్దేవా చేశారు. తన మన భేదం లేకుండా హైడ్రా పనిచేస్తోందని పేర్కొన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఏఐసీసీ పరిధిలో ఉందని పేర్కొన్న టీపీసీసీ చీఫ్.. డీసీసీల ఏర్పాటు, ఇతర విధానాలపై రాహుల్ గాంధీతో సమావేశం జరగనుందని చెప్పారు. సమావేశానికి ఏఐసీసీ నియమించిన 22 మంది పరిశీలకులు హాజరవుతారని పేర్కొన్నారు. పరిశీలకుల బృందం అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేస్తుందని వెల్లడించారు.


