గుట్టలు, అడవుల్లో చెట్లను నరకడంతోనే అడవుల్లో ఉన్న కోతులు గ్రామాల్లోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామంలో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 5 నుండి 9 వరకు స్వచ్చదనం–పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, మహిళా స్వశక్తి సంఘాల సభ్యులందరూ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వారందరు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు.
గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రతి ఇంటికి మొక్కలను అందిస్తామన్నారు. మహిళా సంఘాల నేతృత్వంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను చేపట్టాలని, ఇళ్లలో తడి-పొడి చెత్తను వేరు వేరుగా వేయలన్నారు. చెత్తను ఎక్కడ పడితె అక్కడ పడేయకుండా చూడడంతో పాటు తడి-పొడి చెత్త వేరు చేసి ఇంటిలోనే కంపోస్టు ఎరువును తయారు చేసుకొవాలని సూచించారు. వర్షాల కారణంగా ఎక్కడ పడితే అక్కడ నీరు నిల్వ కాకుండా తగిన చర్యలు చేపట్టాలని, నీరు నిల్వ ఉంటే డెంగ్యూ, మలేరియా జ్వరాలు వస్తున్నాయన్నారు. మానవ తప్పిదాలు, చెట్లు నరకడం వల్ల అడవుల్లో ఉండే కోతులు, జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయని, వాటిని నివారించాలంటే ప్రతి ఒక్కరం ప్రకృతిని కాపాడాలన్నారు.
కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీధర్, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపిడిఓ వరలక్ష్మీ, ఎంపిఓ కిరణ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ అలేఖ్య, వివిధ శాఖల అధికారులు, శ్వశక్తి సంఘాల మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.