న్యాయస్థానంలో కేసులను వేగంగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.ప్రభాకర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జ్ జి.ఉదయకుమార్, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, డిసిపి సుధీర్ రామ్నాథ్ కేకన్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ న్యాయస్థానంలో కేసుల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలోని వివిధ కోర్టులలో ఉన్న క్రిమినల్ కేసులలో సత్వర విచారణ జరుగుతుందని, క్రింద కోర్టులో ఎన్.బి.డబ్ల్యు కేసులు, జైళ్ళలో ఉన్న ఖైదీల గురించి న్యాయవిచారణ వేగవంతం చేస్తామన్నారు. సివిల్ కేసులలో ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సివిల్ దావాలలో ల్యాండ్ ఆక్వేషన్ కేసులలో నష్టపరిహారం సత్వరంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎక్సైజ్ కేసులలో వచ్చే సాక్షులను పోలీసులు కేసుల పూర్వాపరాలు విశదీకరించి బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని, పోలీసుల పనితీరు, కేసుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎసిపి తిరుపతిరెడ్డి, ఎక్సైజ్ కమీషనర్, న్యాయవాదులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.