Saturday, November 23, 2024
HomeతెలంగాణManchiryala floods: ముంపులో మంచిర్యాల

Manchiryala floods: ముంపులో మంచిర్యాల

తగ్గిన వానలు, ఆగని వరద

భారీ వర్షాలు, వరదలతో గోదావరికి వరద పోటెత్తింది. ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల నుంచి భారీగా ఇన్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి వచ్చి చేరుతోంది. శుక్రవారం వర్షం తగ్గు మొహం పట్టిన కడెం ప్రాజెక్టు నుంచి భారీగా ఇన్లో రావడంతో అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు 48 గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. గంట గంటకు గోదావరికి వరద ఉధృతి పెరగడంతో తీర ప్రాంతాల పట్టణాలు, గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు జిల్లా అధికారులు. మంచిర్యాలలోని రాళ్లవాగుకు గోదావరి ఎగతన్నుతోంది. ఏ క్షణమైనా జిల్లా కేంద్రంలోని పలు కాలనీలను వరద చుట్టు ముట్టే ప్రమాదం పొంచి ఉంది. ముందు జాగ్రత్తగా ఎన్టీఆర్ నగర్ కాలనీలోని ఇండ్లను అధికారులు ఖాళీ చేయించారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, కలెక్టర్ బదావత్ సంతోష్, డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఏసీపీ తిరుపతిరెడ్డి ముప్పు ప్రాంతాల పరిస్థితిని పర్యవేక్షించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం. వైశ్యభవన్, ఆర్బీహెచ్బీ స్కూల్లో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి దాదాపు 200 పైగా కుటుంబాలను తరలించారు. రాంనగర్, ఎల్ఐసీకాలనీ, ఆదిత్య ఎన్ క్లేవ్ ఏరియాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు స్వచ్ఛందంగా ఇండ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లోని వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

- Advertisement -

12 పునరావాస శిబిరాల ఏర్పాటు…

జిల్లావ్యాప్తంగా 12 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి సుమారు వెయ్యి కుటుంబాలను తరలించారు. జన్నారం మండలం రోటిగూడలో గీతామందిర్ ఫంక్షన్ హాల్, బాదంపల్లిలోని పోచమ్మవాడ ప్రజలకు బాదంపల్లి ఫంక్షన్ హాల్, పొనకల్ బుడగజంగాల కాలనీ, సుందరయ్య కాలనీలో వాసులను పీఆర్టీయూ భవన్, తపాల్పూర్ ఎస్సీ కాలనీ వాసులను జడ్పీ హైస్కూల్, తిమ్మాపూర్ లో ట్రైబల్వెల్ఫేరెస్కూల్, రాంపూర్ ఎస్టీ తండా, గొల్లవాడలో మాలసంఘం భవనం, ధర్మారం, గోండుగూడలో ప్రైమరీ స్కూళ్లలో శిబిరాలను ఏర్పాటు చేశారు. దండేపల్లి మండలంలోని గుడిరేవు, ద్వారకలో స్థానిక స్కూళ్లలో క్యాంపులు ఏర్పాటు చేశారు. కోటపల్లి మండలం కొత్త దేవులవాడ, పాత దేవులవాడ గ్రామాల్లోని సుమారు 2వేల మందిని చెన్నూర్ లోని సంతోషిమాత ఫంక్షన్ హాల్ కు, బోరంపల్లి గ్రామస్తులను కొల్లూర్ స్కూలకు తరలించారు. చెన్నూర్మండలంలోని అక్కెపల్లి గ్రామస్తులను ఎంఆర్ఆర్గార్డెన్, చింతపల్లి, పొక్కూర్రామస్తులను స్థానిక స్కూళ్లకు పంపించారు. చెన్నూర్ టౌన్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న పది కుటుంబాలను సాయిరాం ఫంక్షన్హాల్ కు తరలించారు.

నిండా మునుగుతున్న పంటలు..

కాళేశ్వరం బ్యాక్ వాటర్ చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని గోదావరి తీర గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే వేల ఎకరాల్లో పత్తి నీటమునిగి రైతులు లబోదిబోమంటున్నారు. చెన్నూర్మండలం బీరెల్లి, సోమన్పల్లి, నాగాపూర్, పాక్కూర్, సుందరశాల, ముత్తారావుపల్లి, వెంకంపేట, నర్సక్కపేట, చింతలపల్లి గ్రామాల్లో నదీతీరంలోని పత్తి చేలు మునిగాయి. కోటపల్లి మండలంలోని రాంపూర్, దేవులవాడ, కొల్లూరు, బబ్బెరచెల్క, లక్ష్మీపూర్, అర్జునగుట్ట, రాపన్పల్లి గ్రామాల్లోని పత్తి చేలను వరద చుట్టుముట్టింది.

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు ఆగని వరద….

కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో గోదావరి ఒక్కసారిగా ఉప్పొంగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గంట గంటకు వరద పెరిగింది. ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో పాటు రాళ్ళవాగు పొంగిపొర్లడంతో మెదరివాడ, ఎన్ టిఆర్ నగర్, రామ్ నగర్, పద్మశాలి కాలనీలు నీట మునిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద ఉధృతి ఇంకా పెరగనుందనే సమాచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏది ఏమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News