Tuesday, September 17, 2024
HomeతెలంగాణManchiryala: సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరామ్ కు 'జియో మైన్ టెక్' అవార్డు

Manchiryala: సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరామ్ కు ‘జియో మైన్ టెక్’ అవార్డు

జాతీయ స్థాయిలో సింగరేణి సంస్థ మరోసారి అత్యుత్తమ జియో మైన్ టెక్ ‘గ్లోబల్ రెయిన్బో’ అవార్డును అందుకుంది. అలాగే డైరెక్టర్ ఫైనాన్స్, పా ఎన్.బలరామ్ ఉత్తమ డైరెక్టర్ గా కార్పొరేట్ మేనేజ్మెంట్, ఇన్నోవేటివ్ లీడర్షిఫ్ ఎక్సలెన్స్ అవార్డును బహూకరించారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఖనిజ కంపెనీలు, అధికారులను గుర్తించి, వారికి ప్రోత్సహించే, జియో మైన్ టెక్ సంస్థ (11వ తేది) ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో జరిగిన ‘నేషనల్ టెక్నాలజీ డే’ ఉత్సవంలో ఈ అవార్డులను ప్రకటించి అందజేశారు. ఒడిశా రాష్ట్ర పర్యావరణ, అటవీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రదీప్ కుమార్ అమత్ ఈ అవార్డులను సింగరేణి సంస్థ తరఫున హాజరైన జనరల్ మేనేజర్, (హెచ్.ఆర్.డి) బి.హెచ్.వెంకటేశ్వర్లు, ఏజీఎం (నైనీ) మజుందార్, ఎస్.ఇ రాజశేఖర్ కు అందజేశారు. సింగరేణి ప్రతిభకు గుర్తింపుగా ‘విబ్జియార్ గోల్డెన్ రెయిన్బో’ అవార్డు 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన అత్యుత్తమ బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా, సి.ఎస్.ఆర్. కార్యక్రమాలు, పర్యావరణ చర్యలకు గుర్తింపుగా జియో మైన్ టెక్ వారు ‘విబ్జియార్ గోల్డెన్రెయిన్బో అవార్డును సింగరేణి సంస్థకు ప్రకటించి అందచేశారు. గత ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థ 667 లక్షల టన్నుల బొగ్గు రవాణా, 671లక్షల బొగ్గు ఉత్పత్తి సాధించింది. అలాగే 32,830 కోట్ల రూపాయల టర్నోవర్ కూడా సాధించింది. సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్ సంస్థగా పేరు తెచ్చుకుంది. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ఇప్పటికే సుమారు ఆరు లక్షల మొక్కలను నాటింది. ఒక మైనింగ్ సంస్థగా అన్ని విభాగాల్లోనూ, అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న సింగరేణికి ‘విబ్జియార్ గోల్డెన్ రెయిన్బో’ అవార్డును అందజేశారు.
పర్యావరణహితునికి ‘బెస్ట్ డైరెక్టర్ లీడర్షిప్ ఎక్సలెన్స్’ అవార్డు
కాగా, సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్, పా ఎన్.బలరామ్ పర్యావరణ, అటవీ విభాగాల్లో చేస్తున్న సేవలకు, ‘‘గ్రీవెన్స్ డే’’ వంటి వినూత్న ప్రక్రియ ద్వారా కార్మికుల సమస్యలను తెలుసుకోవడం, పరిష్కరించడం వంటి చర్యలకు గుర్తింపుగా ‘బెస్ట్ డైరెక్టర్, కార్పోరేట్ మేనేజ్మెంట్, ఇన్నోవేటివ్ లీడర్షిప్ ఎక్సలెన్స్’ అవార్డును అందజేయడం జరిగింది. ఎన్.బలరామ్ సింగరేణి సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి సంస్థ ఆర్థిక వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రశంసలు అందుకున్నారు. కోవిడ్ సమయంలో ఆయన కంపెనీ ఆర్థిక వ్యవహారాలు చక్కదిద్దటంలోనూ, ఛైర్మన్, ఎండీ ఆదేశం మేరకు టర్కీ నుండి ఐదు ఆక్సిజన్ ప్లాంట్లను సింగరేణికి తెప్పించి ఏర్పాటు చేయడంలోనూ కీలకపాత్ర పోషించారు. వన ప్రేమికుడైన బలరామ్ సొంతగా 15 వేల మొక్కల్ని సింగరేణిలోని తొమ్మిది ఏరియాల్లో స్వయంగా నాటి అనేక అవార్డులు అందుకున్నారు. ఆయన నాటిన మొక్కలు నేడు వనాలుగా పెరుగుతున్నాయి.
కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్న ఉద్దేశంతో సింగరేణి ఏరియాల్లో “గ్రీవెన్స్ డే”ని నిర్వహించి స్వయంగా కార్మికుల నుంచి సమస్యలు స్వీకరించి, పరిష్కరించే ప్రయత్నం చేశారు. అలాగే, బ్యాంకు ఖాతాలు ఉన్న సింగరేణి ఉద్యోగులందరికీ వారి ఖాతాలను ‘కార్పోరేట్ శాలరీ అకౌంట్లు’గా మార్పించి ప్రమాద బీమా సౌకర్యాన్ని బ్యాంకుల ద్వారా వర్తింప చేయడానికి ఆయన ప్రత్యేక చొరవ చూపారు. డైరెక్టర్ ఫైనాన్స్గా ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తూనే ఆయన డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్)గా, డైరెక్టర్ పర్సనల్ గా కూడా విభిన్న బాధ్యతలను సమర్థంగా నిర్వహించి ప్రశంసలు పొందారు. సింగరేణి వంటి పెద్ద సంస్థలో ప్రస్తుతం ఆయన రెండు ప్రధాన డైరెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వినూత్న ఆలోచనలు అమలు చేస్తూ, పర్యావరణహిత చర్యలు చేపడుతున్న బలరామ్ కు ఈ అవార్డు రావడం పట్ల సింగరేణి సంస్థ, సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News