Friday, September 20, 2024
HomeతెలంగాణManchiryala: ప్రజలకు చేరువలో తెలంగాణ డయాగ్నోస్టిక్ డిస్ట్రిక్ట్ హబ్

Manchiryala: ప్రజలకు చేరువలో తెలంగాణ డయాగ్నోస్టిక్ డిస్ట్రిక్ట్ హబ్

ప్రజలకు అత్యంత చేరువలో తెలంగాణ డయాగ్నొస్టిక్ డిస్ట్రికను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఆర్థిక, వైద్య-ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానం ద్వారా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ ను శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ టి.భానుప్రసాదావు, టి.ఎస్.ఎం.ఐ.డి.సి. చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్వేతామహంతి, వైద్య విధాన పరిషత్ కమీషనర్ డా.అజయ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య-ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ… ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన 8 పాథాలజీ, 16 రేడియాలజీ, డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్న వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ దవాఖానకు వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం డయాగ్నస్టిక్ హబ్లను ఏర్పాటు చేసి 134 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందిస్తున్నామన్నారు.

- Advertisement -

గతంలో 57 రకాల పరీక్షలు ఉచితంగా అందించామని, శనివారం నుంచి అనీమియా, యాంటి బ్యాక్టీరియల్ టెస్ట్, హర్మోనల్ టెస్ట్, క్యాన్సర్ పరీక్షలు, తలసేమియా, ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ, హెచ్.ఐ.వి. టెస్ట్, వైరల్ లోడ్ టెస్ట్ వంటి వ్యాధులను గుర్తించే 77 పరీక్షలు అదనంగా అందించడం జరుగుతుందని తెలిపారు. డయాగ్నస్టిక్ హబ్ ద్వారా 24 గంటలలో రోగులకు, వైద్యులకు సెల్ ఫోన్ ద్వారా పరీక్ష ఫలితాలు అందిస్తామని, ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి, బస్తీ దవఖానాకు డయాగ్నస్టిక్ హబ్ను మ్యాప్ చేయడం జరిగిందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్తీ దవఖానాలలో సేకరించే పరీక్ష నమూనాలు జిల్లా కేంద్రంలో డయాగ్నొస్టిక్ హబు తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేశామన్నారు.

తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ లో నాణ్యమైన పరికరాలు వినియోగిస్తున్నామని, ప్రతి డయాగ్నొస్టిక్ హబక్కు ఎన్.ఏ.బీ.హెచ్ అక్రిడిటేషన్ లభించిందని, రాష్ట్రంలో డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా 1 కోటి 11 లక్షల మందికి 10 కోట్ల 40 లక్షల పరీక్షలు నిర్వహించడం జరిగిందని, వ్యాధి నిర్ధారణ చేయడం వల్ల వేగవంతంగా చికిత్స అందించడం సులభం అవుతుందని తెలిపారు. జిల్లాలలో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ హబ్లో అందించే 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందించడం జరుగుతుందని, ఈ విషయమై జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించి సేవలు వినియోగించుకునే విధంగా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. ప్రతి జిల్లాలో గర్భిణుల కోసం అల్ట్రా సౌండ్, టిఫా స్కాన్ అందుబాటులో ఉంచామని, గర్భిణీ మహిళలకు ఏ.ఎన్.సి. చెక్ అప్ సమయంలో కె.సి.ఆర్. న్యూట్రిషన్ కిట్ అందుతుందో లేదో పర్యవేక్షించాలని, ప్రభుత్వ చర్యల కారణంగా ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య 30 నుంచి 70 శాతానికి పెరిగిందని తెలిపారు. రేడియాలజీ ల్యాబ్లో మామ్మోగ్రామ్ వద్ద మహిళా ఆపరేటర్ మాత్రమే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, మహిళలు విస్తృతంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో ఎ.ఎన్.ఎం. ఉప కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, వాటిని త్వరగా పూర్తి చేసే దిశగా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ ప్రజలకు చేరువలో జిల్లా కేంద్రంలో 1 కోటి 25 లక్షల రూపాయల వ్యయంతో తెలంగాణ డయాగ్నొస్టిక్ డిస్ట్రిక్ హబ్ను ఏర్పాటు చేశామన్నారు.

డాక్టర్స్ డే సందర్భంగా జిల్లాలో డయాగ్నొస్టిక్ హబ్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, ఇంతకు ముందు 57 రకాల పరీక్షలను నిర్వహించడం జరిగేదని, ఇప్పుడు హబ్ ద్వారా 134 రకాల పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. రేడియాలజీ, పాథాలజీ లాబ్, రక్త, మూత్ర పరీక్షలు, ఎక్స్, అన్ని పరీక్షలను ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలుపుకొని 5 వాహనాలు ఏర్పాటు చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సేకరించిన రక్త నమూనాలను తీసుకొచ్చి డయాగ్నొస్టిక్ హబ్లో పరీక్షించడం జరుగుతుందని, పరీక్షలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించి సంబంధిత వ్యక్తుల వివరాలతో ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 24 గంటలలోగా పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జిసి.సుబ్బారాయుడు, వార్డు కౌన్సిలర్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News