Saturday, November 23, 2024
HomeతెలంగాణManchiryala: స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి

Manchiryala: స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి

నూతన ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో సవరణలు, తొలగింపుల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి.మధుసూదన్ నాయక్తో కలిసి మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు దాసరి వేణు, శ్యామలాదేవి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా రూపకల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… నూతన ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో సవరణలు, తొలగింపులలో పొరపాట్లు లేకుండా పూర్తి వివరాలతో జాబితా రూపొందించాలని తెలిపారు. నూతన ఓటరు నమోదుకు గతంలో ప్రామాణికంగా ఉన్న జనవరి 1వ తేదీన మార్పు చేస్తూ జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 2022 జనవరి 5 నుండి 2023 జనవరి 5వ తేదీ జరిగిన నూతన ఓటర్ల నమోదులో భాగంగా జిల్లాలో 15 వేల 459 మంది తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారని, మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో 5 వేల 370 మంది, చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో 5 వేల 565 మంది, బెల్లంపల్లి నియోజకవర్గంలో 3 వేల 524 మంది ఉన్నారని తెలిపారు. ఓటరు జాబితాలో నమోదు అయి ఉండి పేరు, చిరునామా మార్పుల కొరకు అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. జాబితాలో వివరాల తొలగింపు కొరకు అందిన దరఖాస్తులకు సంబంధించి భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నోటీసు జారీ చేసి తొలగింపు చేయాలని, ఈ క్రమంలో జిల్లాలో 17 వేల 517 మంది వివరాలు తొలగించడం జరిగిందని తెలిపారు. ఓటర్ల తొలగింపు కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అధికారులు జాగ్రత్త వహించాలని, తొలగింపు వివరాలను మరొకసారి పరిశీలించుకోవాలని తెలిపారు. జనవరి 5వ తేదీ తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన తరువాత మరో 10 వేల దరఖాస్తులు పరిశీలించవలసి ఉందని, త్వరలోనే పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈఆర్ఓ నెట్ లో వచ్చిన దరఖాస్తుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం పరిష్కరించడం జరుగుతుందని, ఈ ప్రక్రియలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమావేశం ప్రతి వారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్థాయిలో నిర్వహిస్తూ పార్టీల ప్రతినిధులకు ఫారం-9, 10, 11 లను అందజేయడం జరుగుతుందని, అభ్యంతరాలు, ఆక్షేపణలను సూచించాలని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవిఎం, వివి పాట్లు, కంట్రోల్ యూనిట్ల పరిశీలనలో భాగంగా జూన్ 1వ తేదీ నుండి మొదటి స్థాయి పరిశీలన ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఈవిఎం గోదాములో భద్రపరిచిన ఈవిఎం లు, కంట్రోల్ యూనిట్లు, వివి పాట్లను ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరీక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News