Saturday, November 23, 2024
HomeతెలంగాణManchiryala: వైద్య సేవల కోసం కృషి

Manchiryala: వైద్య సేవల కోసం కృషి

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఫిజియోథెరపి మానసిక ఆరోగ్య -కౌన్సిలింగ్ కేంద్రాలను మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు, ట్రైనీ కలెక్టర్ పి.గౌతమి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుబ్బరాయుడు లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించిన ఫిజియోథెరపి, మానసిక ఆరోగ్య కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరికి ఎముకలు, కండరాల నొప్పులు వస్తుంటాయని, నివారణ కొరకు ఫిజియోథెరపి కేంద్రంలో వైద్య సేవలు అందించడం జరుగుతుందని, ఈ కేంద్రంలో అందించే వైద్య సేవలను నోటీసు బోర్డులో ప్రజలకు తెలిసే విధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. మనలో చాలా మంది ఆత్మన్యూనతా భావానికి గురవుతుంటారని, ఏకాగ్రత లోపం, లేనివి ఉన్నట్ల భ్రమపడటం, స్వీయ నియంత్రణ లేకపోవడం, తనతో తాను మాట్లాడుకోవడం, నిందించుకోవడం లాంటి ఆలోచనలతో మానసిక అనారోగ్యానికి గురవుతారని, ఇలాంటి ఆలోచనల నియంత్రణ, నివారణ కోసం మానసిక ఆరోగ్య-కౌన్సిలింగ్ కేంద్రంలో చికిత్స అందిస్తారన్నారు.

- Advertisement -

పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రేమ, అప్యాయత కలిగి ఉండాలని, పిల్లల ఎదుగుదల సమయంలో పర్యవేక్షణ అవసరమని, పిల్లలు అకస్మాత్తుగా చదువులో వెనుకబడటం, ఏకాగ్రత లోపించడం, అధిక చురుకుతనం, తరుచుగా కోపం, దూకుడుతనం, శారీరక, మానసిక అభివృద్ధి ఆలస్యం మొదలైన సమస్యలను పరిష్కరించేందుకు మానసిక ఆరోగ్య కేంద్రం ద్వారా చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. మానసిక అనారోగ్యానికి సంబంధించిన అనుమానాలు, చికిత్స కోసం టెలీమానస్ టోల్ ఫ్రీ నం. 14416లో సంప్రదించవచ్చని, ఈ విషయమై ప్రజలకు తెలిసే విధంగా విస్త్రృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు కలిగిన ఆహారం సమయానికి తీసుకోవాలని, ప్రతి రోజు వ్యాయామం, యోగ, ధ్యానం చేయాలని, ఒత్తిడిని తొలగించేందుకు సరిపడినంత నిద్ర ఉండాలని, మద్యం, పొగాకు ఉత్పత్తులకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత పాటించాలని తెలిపారు. ఈ కార్యమ్రంలో ఆర్.ఎం.ఓ. డాక్టర్ భీష్మ, ప్రోగ్రామ్ అధికారి డా. విజయపూర్ణమి, వైద్యాధికారులు డా. సునీల్, డా. ప్రశాంతి, నోడల్ అధికారి లింగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ మాధంశెట్టి సత్యనారాయణ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News