ఛత్తీస్గఢ్ బీజాపూర్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కీలక నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. రెండు రోజుల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో దామోదర్ మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ ధృవీకరించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో శనివారం లేఖ విడుదల చేశారు. ఈ ఎన్ కౌంటర్లో దామోదర్‌తో పాటు మరో 17 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు వెల్లడించారు.
చొక్కారావు 30 ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. ఇతనిపై రూ.50 లక్షల రివార్డు కూడా ఉంది. స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి. ప్రస్తుతం ఆయన తెలంగాణ మావోయిస్ట్ పార్టీ సెక్రటరీగా ఉన్నారు. చిన్నతనంలోనే మావోయిస్టు పార్టీలో చేరిన దామోదర్ రావు అంచెలంచెలుగా ఎదిగారు. 30 ఏళ్ల పాటు పార్టీలో పని చేసిన దామోదర్ ఎన్నో ఏళ్లుగా పోలీసులు మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. దామోదర్ హెడ్‌పై రూ.50 లక్షల రివార్డ్ ఉంది.
ఇక గురువారం జరిగిన ఎన్‌కౌంటర్ అనంతరం భద్రతా బలగాలు మావోయిస్టుల ఆయుధాలు స్వాధీనం చేసుకోవడంతోపాటు భారీ బంకర్‌ను గుర్తించాయి. ఇందులో సొరంగల్ దేశవాళీ రాకెట్ లాంచర్లు, పెద్దఎత్తున యంత్రాలు, మందుగుండు సామగ్రి, విద్యుత్తు లైన్ నిర్మించే సిల్వర్ వైర్లు లభించాయి.