Married Man Marries Class 8 Student: మహిళా సాధికారత గురించి ఎంత మాట్లాడుకున్నా.. ప్రభుత్వాలు, ఎన్జీవోలు, సామాజిక కార్యకర్తలు ఎంత కృషి చేస్తున్నా.. కొన్ని జాఢ్యాలు సమాజాన్ని ఇప్పటికీ విడవడం లేదు. ప్రధాని మోదీ సైతం భేటీ పడావో భేటీ బచావో వంటి నినాదాలతో బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చినా కొందరు ఇప్పటికీ దానిని పెడచెవిన పెడుతున్నారు. తెలంగాణలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఓ బాలిక వివాహమే అందుకు నిదర్శనం. రంగారెడ్డి జిల్లాలో 8వ తరగతి చదువుతున్న బాలికను వివాహం చేసుకున్నాడు 40 ఏళ్ల వ్యక్తి.
ఏం జరిగిందంటే..
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో 13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్నాడు 40 ఏళ్ల శ్రీనివాస్ గౌడ్. అతడికి ఇదివరకే వివాహం జరిగింది. ఇటీవలే ఈ విషయాన్ని బాలిక తన పాఠశాల టీచర్‌కి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
టీచర్ ఫిర్యాదుతో ఘటనపై ‘బాల్య వివాహాల నిరోధక చట్టం’ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. శ్రీనివాస్ గౌడ్, అతడి భార్య, వివాహం జరిపించిన పంతులు, బాలిక తల్లిదండ్రులపై సైతం కేసు నమోదైంది. బాలికను సంరక్షణ గృహానికి తరలించి దర్యాప్తు ముమ్మరం చేశారు.
రెండు నెలలుగా శ్రీనివాస్ గౌడ్‌తోనే బాలిక కలిసి ఉందని, ఇటీవలే తన ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే బాలికను శారీరకంగా కలవమని బలవంతం చేసి ఉంటే అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
అయితే పేదరికం కారణంగా బాల్య వివాహాలు జరగుతుంటాయని, తాజా ఘటనలు మాత్రం బాలికలు ప్రేమించి, ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారనే భయంతో త్వరగా పెళ్లి చేసేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. బిడ్డలకు ఉన్నత చదువులు చెప్పించి వారి కాళ్ల మీద వారినే నిలబడేలా చేయాల్సిన తల్లిదండ్రులే చిన్న వయసులో పెళ్లి చేసి వారి రెక్కలను విరిచేస్తున్నారు.


