Heavy rainfall in Medak district : మెతుకుసీమను వరుణుడు ముంచెత్తాడు. రాత్రికి రాత్రే కురిసిన కుండపోత వానతో జిల్లా అతలాకుతలమైంది. వాగులు, వంకలు ఉప్పొంగి మహోగ్రరూపం దాల్చగా, పచ్చని చేలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. రహదారులు తెగిపోయి అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అసలు ఏయే మండలాల్లో వర్ష బీభత్సం ఎక్కువగా ఉంది..? అధికార యంత్రాంగం తీసుకుంటున్న తక్షణ చర్యలేంటి..? ప్రజలు సహాయం కోసం ఎవరిని సంప్రదించాలి..?
వరుణుడి ఉగ్రరూపానికి మెదక్ (మెతుకుసీమ) జిల్లా అతలాకుతలమైంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురిసిన అతి భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. తూప్రాన్, పెద్దశంకరంపేట, వెల్దుర్తి, కౌడిపల్లి, కొల్చారం, చిలప్‌చెడ్, టేక్మాల్ సహా పలు మండలాల్లో వాన దంచికొట్టింది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో వరద నీరు రోడ్లపైకి చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఎస్పీ హెచ్చరిక – కంట్రోల్ రూం ఏర్పాటు : భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. పాత ఇళ్లలో నివసించేవారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ఎలాంటి ఆపద వచ్చినా తక్షణమే స్పందించేందుకు వీలుగా ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ప్రజలు సహాయం కోసం 87126-57888 నంబరుకు గానీ, డయల్ 100కు గానీ ఫోన్ చేయవచ్చని తెలిపారు. మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.
జలదిగ్బంధంలో పలు గ్రామాలు : జిల్లావ్యాప్తంగా పలుచోట్ల రోడ్లు తెగిపోవడం, వంతెనలపై నుంచి వరద ప్రవహించడంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
శివ్వంపేట మండలం: గోమారం వద్ద పెద్ద చెరువు కట్ట వంతెన కోతకు గురై రోడ్డు తెగిపోయింది.
వెల్దుర్తి మండలం: ఉప్పులింగాపూర్ వద్ద హల్దీ వాగు వంతెన పైనుంచి ప్రవహిస్తుండటంతో మెదక్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.
టేక్మాల్ మండలం: గుండువాగు పొంగిపొర్లడంతో టేక్మాల్ నుంచి జోగిపేటకు రాకపోకలు బందయ్యాయి.
తూప్రాన్ మండలం: యావాపూర్, కిష్టాపూర్ సహా పలు మార్గాల్లో చెక్‌డ్యామ్‌లు నిండి రోడ్లపై ప్రవహిస్తున్నాయి.
హల్దీ ప్రాజెక్టు: వెల్దుర్తి మండలంలోని హల్దీ ప్రాజెక్టు పూర్తిగా నిండి మత్తడి ప్రమాదకరస్థాయిలో పారుతోంది. సందర్శకులను నిలువరించేందుకు పోలీసులు ఇరువైపులా పికెట్లు ఏర్పాటు చేశారు.
చెరువులకు జలకళ.. అధికారుల పర్యటన : ఒక్కరోజులోనే జిల్లాలోని 936 చెరువులు నిండి అలుగు పారుతుండటం వర్షపు తీవ్రతకు అద్దం పడుతోంది. కలెక్టర్ రాహుల్‌రాజ్, ఇతర జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు కాపలా కాస్తూ ప్రజలు ప్రమాదకరంగా నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.


