Mee Ticket app for Telangana tourism : దేవాలయ దర్శనానికెళ్లినా, పర్యాటక ప్రదేశానికి వెళ్లినా గంటల తరబడి టికెట్ల కోసం క్యూ లైన్లలో నిరీక్షణ.. చిల్లర లేక తిప్పలు.. ఈ అనుభవాలు మనందరికీ ఎదురయ్యేవే. ఈ చిరాకులతో సగం ఉత్సాహం నీరుగారిపోతుంది. ఈ సమస్యలన్నింటికీ స్వస్తి పలుకుతూ, ప్రభుత్వం ఓ చక్కటి పరిష్కారంతో ముందుకొచ్చింది. అదే ‘మీ టికెట్’ యాప్. ఇకపై ఆలయాల నుంచి జూ పార్కుల వరకు, బోటింగ్ నుంచి మ్యూజియంల వరకు అన్ని ప్రవేశ టికెట్లనూ మీ అరచేతిలోనే బుక్ చేసుకోవచ్చు. అసలు ఏమిటీ యాప్..? దీనిని ఎలా ఉపయోగించాలి..? ఏయే ప్రదేశాలకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంది..?
పర్యాటకుడి తిప్పలకు.. టెక్నాలజీతో ‘చెక్’ : పండుగలు, సెలవు రోజుల్లో ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఉండే రద్దీ అంతా ఇంతా కాదు. టికెట్ కౌంటర్ల వద్ద తోపులాటలు, సమయం వృథా ప్రయాణ అనుభవాన్ని దెబ్బతీస్తాయి. కొన్ని చోట్ల ఆన్‌లైన్ పేమెంట్లు అంగీకరించకపోవడం మరో తలనొప్పి. ఈ ఇబ్బందులను దూరం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ‘మీ టికెట్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. హోటళ్లు, ప్రయాణ టికెట్లలాగే, ఇప్పుడు సందర్శనీయ స్థలాల ప్రవేశ టికెట్లను కూడా ముందుగానే, సులభంగా బుక్ చేసుకునే వెసులుబాటును ఈ యాప్ కల్పిస్తోంది.
‘మీ టికెట్’ యాప్.. వినియోగం ఇలా : ఈ యాప్‌ను ఉపయోగించడం చాలా సులభం.
డౌన్‌లోడ్: ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘మీ టికెట్’ యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్: మీ ఫోన్ నంబర్‌తో లాగిన్ అయి, ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకుని, ఒక పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి.
ప్రదేశాన్ని ఎంచుకోండి: మీరు వెళ్లాలనుకుంటున్న దేవాలయం, పార్కు లేదా ఇతర పర్యాటక ప్రదేశాన్ని జాబితా నుంచి ఎంచుకోవాలి.
వివరాలు నమోదు: ఏ రోజు, ఎంత మంది వెళ్తున్నారనే వివరాలను నమోదు చేయాలి. కెమెరా వంటివి తీసుకెళ్తుంటే ఆ వివరాలు కూడా పొందుపరచాలి.
చెల్లింపు: చివరగా ఆన్‌లైన్‌లో (డెబిట్/క్రెడిట్ కార్డు, యూపీఐ ద్వారా) చెల్లింపు పూర్తి చేస్తే, మీ టికెట్ బుక్ అవుతుంది. ఆ టికెట్‌ను ప్రవేశ ద్వారం వద్ద చూపించి లోపలికి వెళ్లవచ్చు.
ఈ యాప్‌లో గూగుల్ లొకేషన్ ఆధారంగా మీకు సమీపంలోని పర్యాటక ప్రాంతాలను చూపించే సదుపాయం కూడా ఉంది.
ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయి : ప్రస్తుతం ఈ యాప్ ద్వారా రాష్ట్రంలోని అనేక ప్రముఖ ప్రదేశాలకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ప్రధాన దేవాలయాలు (15): భద్రాచలం, బాసర, యాదగిరిగుట్ట, వేములవాడ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు.
పార్కులు (129): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక పార్కులు.
జూ పార్కులు (4), మ్యూజియాలు (6).
బోటింగ్ ప్రదేశాలు (7), జలాశయాలు (3).
అటవీ ప్రాంతాలు (5): అడవుల్లోని క్యాంపు ప్రదేశాలు.
ఇతర సేవలు: మెట్రో రైల్ టికెట్లు, నగరాల్లోని ఈవీ ఛార్జింగ్ కేంద్రాల వివరాలు కూడా ఈ యాప్‌లో లభిస్తాయి. ఇకపై ప్రయాణ ప్రణాళిక వేసుకునేటప్పుడు, టికెట్ల గురించి చింతించకుండా, ‘మీ టికెట్’ యాప్‌తో మీ సమయాన్ని, శ్రమను ఆదా చేసుకోండి.


