Tuesday, March 4, 2025
HomeతెలంగాణMetro Skywalks: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు మెట్రో స్కైవాక్‌లతో స్కెచ్

Metro Skywalks: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు మెట్రో స్కైవాక్‌లతో స్కెచ్

హైదరాబాద్‌లో రోజురోజుకు జఠిలంగా మారుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రైవేట్ వాహనాల సంఖ్యను తగ్గించి ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని వాణిజ్య, నివాస సముదాయాలకు స్కైవాక్‌లు(Metro Skywalks) నిర్మించేందుకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించింది. రెండు రోజు క్రితం HMDA స్వర్ణజయంతి భవన్‌లో జరిగిన సమగ్ర మొబిలిటీ సమావేశంలో HMRL ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, HMDA మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఇందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు.

- Advertisement -

ఇప్పటికే ఎల్ అండ్ టీ(L&T) సంస్థ పంజాగుట్ట, హైటెక్ సిటీ, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ల నుంచి తమ మాల్స్‌కు స్కైవాక్‌లు నిర్మించడంతో మెట్రో ప్రయాణీకులు రోడ్డు దాటకుండానే నేరుగా ఈ వాణిజ్య సముదాయాలకు చేరుకుంటున్నారు. అదే విధంగా JBS, పెరేడ్ గ్రౌండ్ స్టేషన్లను కలుపుతూ ప్రయాణీకులు రోడ్డు దాటే అవసరం లేకుండా స్కైవాక్ లు నిర్మించారు. ఇక రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి రహేజా మైండ్ స్పేస్ కాంప్లెక్స్‌కు రహేజా సంస్థ ఆధునిక సౌకర్యాలతో కూడిన స్కైవాక్ నిర్మించింది. దీంతో ఈ కాంప్లెక్స్‌లోని 11 టవర్లలో పనిచేసే అంతర్జాతీయ సంస్థల ఉద్యోగులు సులభంగా చేరుకుంటున్నారు.

ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఉప్పల్ జంక్షన్ చుట్టూ ఉన్న రోడ్లన్నింటినీ కలిపేలా HMDA వలయాకార రోటరీ స్కైవాక్ నిర్మించింది. ఈ పైవంతెన మెట్రో ప్రయాణీకులతో పాటు రోడ్డు దాటే పాదచారులకు కూడా బాగా ఉపయోగపడుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రియల్ ఎస్టేట్ సంస్థలు, నివాస-వాణిజ్య సముదాయాల నుంచి మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు.

ప్రస్తుతం డాక్టర్ అంబేద్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్ నుంచి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫీనిక్స్/ల్యాండ్‌మార్క్ మాల్‌కు ఆ సంస్థ స్కైవాక్ నిర్మిస్తోంది. అలాగే ఎల్బీ నగర్ స్టేషన్ నుంచి వాసవీ ఆనందనిలయం నివాస సముదాయానికి వాసవీ గ్రూప్ స్కైవాక్ నిర్మిస్తోంది. ఈ కాంప్లెక్స్ 25 ఎకరాల్లో ఒక్కో టవర్‌లో 33 అంతస్తులతో 12 టవర్లతో నిర్మాణం చేపట్టిందతి. పెద్ద సంఖ్యలో ఇక్కడ నివసించే కుటుంబాలకు ఈ స్కైవాక్ చక్కటి సౌలభ్యం అవుతుంది. అలాగే నాగోల్, స్టేడియం, దుర్గం చెరువు, కూకట్‌పల్లి స్టేషన్ల నుంచి స్కైవాక్‌ల కోసం మరికొన్ని సంస్థలు చర్చలు జరుపుతున్నాయని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు.

ఎవరైనా ప్రైవేట్ సంస్థలు మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్‌లు నిర్మించాలనుకుంటే, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ రిటైల్ అధికారి కె.వి. నాగేంద్ర ప్రసాద్‌ను 9900093820 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు. హైదరాబాద్ మెట్రో మొదటి దశలో 69 కిలోమీటర్లలో విస్తరించిన 57 స్టేషన్లు ఉన్నాయి. ప్రతి స్టేషన్ వద్ద రోడ్డు ఒకవైపు నుంచి మరో వైపునకు చేరే సౌకర్యం ఉంది. ఈ స్కైవాక్‌లను మెట్రో ప్రయాణీకులతో పాటు సాధారణ పాదచారులు కూడా ఉచితంగా వాడుకోవచ్చు. రోడ్డు దాటే ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఎన్వీఎస్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News