ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో సమ్మక్క-సారలమ్మల మినీ మేడారం జాతర(Mini Medaram Jatara) ఘనంగా ప్రారంభమైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగనుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం మహా జాతర నిర్వహిస్తారు. అయితే మధ్యలో వచ్చే ఏడాది మాత్రం మినీ జాతరను జరుపుకుంటారు. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.30 కోట్లు కేటాయించింది. వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేసింది. అలాగే జంపన్నవాగు వద్ద జల్లు స్నానాలు, దుస్తులు మార్చుకునేందుకు గదులు, క్యూలైన్లలో తాగునీరు, చలవ పందిళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక జాతరకు వెళ్లే భక్తుల కోసం టీజీఆర్టీసీ 200 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
కాగా తొలి రోజు గద్దెలను శుద్ధి చేసి గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా ఆలయ పూజారులు దిష్టి తోరణాలు కడుతారు. పున్నమి వెలుగుల్లో పూజారులు జాగారాలు చేస్తారు. రెండో రోజైన గురువారం మండమెలిగె పూజలు, మూడో రోజు శుక్రవారం భక్తుల మొక్కుల చెల్లింపు, చివరగా నాలుగో రోజు శనివారం చిన్న జాతర నిర్వహిస్తారు.