Jupally Krishna Rao: హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలోని పలు కల్లు కాంపౌండ్లలో కల్తీ కల్లు తాగా పలువురు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితును ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మంత్రితో పాటు ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్, నిమ్స్ డైరెక్టర్ డా.బీరప్ప, నెఫ్రాలజీ విభాగాధిపతి డా. గంగాధర్ ఉన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన సంఘటన అత్యంత భాదకరమని తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే ఎక్సైజ్ అధికారులు, పోలీసులు వెంటే స్పందించారన్నారు. బాధితులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారని పేర్కొన్నారు. సకాలంలో వైద్యం అందించడంతో బాధితులు అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. బాధితులందరూ ఒకే రకమైన లక్షణాలతో భాదపడుతున్నారని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తూ బాధితుల్లో ఒకరు మృతి చెందారని వెల్లడించారు. అస్వస్థతకు గురైన వారిలో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి చెందినట్లు పేర్కొన్నారు.
ప్రాథమికంగా ఇది కల్తీ కల్లు వల్లే జరిగిందని భావిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్‌లను సీజ్ చేశామని.. నిర్వాహకులపై కేసులు నమోదుచేశామన్నారు. ఈ ఘటనపై పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఎంతటి వారైనా వదలబోమని హెచ్చరించారు. కొందరు బాధ్యులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారని చెప్పుకొచ్చారు.
Also Read: కల్తీ కల్లు తాగిన ఘటనలో ఒకరు మృతి.. మరికొందరి పరిస్థితి విషమం
కల్లు శాంపిల్స్ సేకరించి ఎక్సైజ్ కెమికల్ ల్యాబోరేటరీకి పంపించామన్నారు. అలాగే చికిత్స పొందుతున్న బాధితుల శ్యాంపిల్స్ కూడా ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారని తెలిపారు. రిపోర్టుల రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా కల్లు డిపోల లైసెన్స్ రద్దు చేస్తామని తేల్చిచెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ప్రత్యేక బృందాల ద్వారా కల్లు డిపోలపై నిరంతర నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానమని జూపల్లి వెల్లడించారు.


