తమ వద్దకు వచ్చే ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బు తీసుకుంటారని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమె మాటలను ప్రతిపక్షాలు తెగ వైరల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాను చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. అలా తప్పుడు ప్రచారం చేయడం సహేతుకం కాదని చెప్పారు. ఏ పనికైనా అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారని మాత్రమే చెప్పానని క్లారిటీ ఇచ్చారు. కావాలనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు ఏం జరిగిందంటే.. వరంగల్‌లోని కృష్ణ కాలనీలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో రూ.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలంలో తరగతి గదులు జలమయం అవుతుండటంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో కొత్త భవనం కట్టడానికి రూ.4.5 కోట్లు ఖర్చు అవుతుందని కలెకర్ట్ తన దృష్టి తీసుకొచ్చారని చెప్పారు. ఈ నేపథ్యంలో తమ వద్దకు వచ్చే ఫైళ్లు క్లియర్ చేసేటప్పుడు మంత్రులు డబ్బులు తీసుకుంటారని.. అలా తనకు నయా పైసా అక్కర్లేదని కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సహకరించాలని అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులను కోరానని ఆమె వ్యాఖ్యానించారు.