మేడ్చల్ నియోజకవర్గం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్ గూడ లో డబల్ బెడ్ రూమ్ ల కేటాయింపును రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి చామకుర మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలందరికీ నీడ కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. పేదవారికి సొంత ఇంటి కలను సాకారం చేయడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన ఈ కార్యక్రమం ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుందని, అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ లు అందేలా చూస్తామన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయాలు, పైరవీలకు తావు లేకుండా, పారదర్శకంగా చేపట్టడం ఎంతో గొప్ప విషయమన్నారు. ప్రభుత్వం చేపట్టిన అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, అర్హులకు అందుతున్నాయన్నారు.
కొన్ని రాజకీయ పార్టీల జీవితమంతా ధర్నాలే అని ప్రతిపక్షాలను ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. పేద ప్రజలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. ఇవాళ ప్రతిపక్షాలు అనేక రకాల మాటలు చెప్తూ ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నాయి. మీరు ఆలోచించండి..ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి కార్యక్రమం తెచ్చింది కేసీఆర్ కాదా..? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. బస్తీ దవఖానాల్లో పేద రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్,గ్రంధాలయ సంస్థ చైర్మన్ దయాకర్ రెడ్డి, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి,జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య,దమ్మాయిగూడ మున్సిపల్ కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు,కొత్త భాస్కర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్,మాజీ ఎంపీటీసీ కొత్త శ్రీనివాస్ గౌడ్,నాయకులు, కార్యకర్తలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.