Wednesday, September 18, 2024
HomeతెలంగాణMinister Ponguleti emotional in Press meet: విలేకరుల సమావేశంలోనే కంటతడి పెట్టిన మంత్రి...

Minister Ponguleti emotional in Press meet: విలేకరుల సమావేశంలోనే కంటతడి పెట్టిన మంత్రి పొంగులేటి

ఒక కుటుంబాన్ని రక్షించేందుకు శతవిధాల ప్రయత్నాలు

శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తన నియోజకవర్గమైన పాలేరులోని కూసుమంచి మండలం నాయకన్ గూడెంకు చెందిన ఇటుకలపని చేసుకునే యాకూబ్ ఆయన భార్య సైదా వరదల్లో కొట్టుకొనిపోవడం పట్ల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉదయం నుంచి ఆ కుటుంబాన్ని రక్షించేందుకు మంత్రిగారు చేసిన ప్రయత్నమంటూ లేదు. విలేకరుల సమావేశం జరుగుతున్న సమయంలోనే యాకూబ్ కుటుంబం వరదల్లో కొట్టుకుపోయిందని సమాచారం అందడంతో ఆ కుటుంబాన్ని ఇంకా ఆ భగవంతుడే కాపాడాలని భావోద్వేగానికి గురయ్యారు. వరద నీటిలోనైనా వారిని రక్షించాలని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముగ్గురిలో ఒకరిని కాపాడగలిగారు. అన్ని ఉన్నా కూడా వాతావరణం అనుకూలించక వారిని రక్షించుకోలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

ఆదివారం హైదరాబాద్లోని డా.బీ.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో భారీ వర్షాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా యాకూబ్ కుటుంబం వరదలో కొట్టుకుపోయిన సమాచారం అందడంతో ఒక్కసారిగా ఖిన్నుడయ్యారు. ఒక దశలో నిమిషంపాటు మాటరాని పరిస్థితికి లోనయ్యారు. ఆ వెంటనే తేరుకుని ఉదయం నుంచి ఆ కుటుంబాన్ని రక్షించడానికి తీసుకున్న చర్యలను వివరించారు.

“నేను ఉదయం నుంచి ఆ కుటుంబాన్ని కాపాడేందుకు చేయని ప్రయత్నం లేదు. నేవీ, ఎయిర్ ఫోర్స్ తో పాటు హకీంపేటలోని పలు హెలికాప్టర్ లను నాయకన్ గూడెంకు పంపేందుకు ఫోన్ ల మీద ఫోన్ లు చేస్తూనే ఉన్నాను. భారీ వర్షాలకు హెలికాప్టర్లు టేక్-ఆఫ్ కావడం కష్టమన్న సమాధానం వచ్చింది. మరోవైపు యాకూబ్ తో పాటు ఆయన భార్య సైదా తో నిరంతరం మాట్లాడుతూ ధైర్యం చెప్తూనే ఉన్నాను. ఎన్.డీ.ఆర్.ఎఫ్. బృందాలను కూడా అక్కడికి పంపాను. వరదకు బృందాలు అక్కడికి వెళ్లలేకపోయాయి. దీంతో స్థానిక యంత్రాంగం కాంగ్రెస్ కార్యకర్తలను సిద్ధం చేసి దగ్గరలో ఉన్న ఊరు నుంచి ఒక డ్రోన్ ను ఆ ప్రాంతానికి పంపించి, ఆ డ్రోన్ కు ఒక తాడు కట్టి లైఫ్ జాకెట్లను వారికి స్థానికులు అందించారు. 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభానికి ముందు కూడా వారితో నేను మాట్లాడాను, ధైర్యం చెప్పాను. ఇంతలోనే భారీ వరద పోటెత్తడంతో వారు ఉన్న ఇంటిగోడ కూలి వరదలో కొట్టుకుపోయారు. అయినప్పటికీ వారి కొడుకు షరీఫ్ ను రక్షించగలిగాం” అంటూ చమర్చిన కళ్ళతో మంత్రి మీడియా ముందు జరిగిన మొత్తం పరిస్థితిని వివరించారు.

ఆ కుటుంబాన్ని రక్షించడానికి చివరి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం పట్ల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.ఈ సంఘటన నేపథ్యంలో “రాష్ట్రంలో ఎవరూ కూడా వరదలు పోటెత్తే ప్రాంతాల్లో ఉండొద్దని వీలైనంత వరకు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. అధికార యంత్రాంగం కూడా వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News